న్యూఢిల్లీ: భారత 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ సోమవారం రాష్ట్రపతి భవనంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన చేత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించారు. ఆయన హిందీలో దేవుని సాక్షిగా ప్రమాణం చేశారు. ఆయనను సీజేఐగా అక్టోబర్ 30న నియమించారు. ఈ పదవిలో ఆయన 2027 ఫిబ్రవరి 9 వరకు దాదాపు 15 నెలలపాటు కొనసాగుతారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. జస్టిస్ కాంత్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రధాని మోదీ వద్దకు వెళ్లి, నమస్కరించారు. జస్టిస్ సూర్యకాంత్ 1962 ఫిబ్రవరి 10న హర్యానాలోని హిసార్ జిల్లాలో మధ్య తరగతి కుటుంబంలో జన్మించారు. కురుక్షేత్ర విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ చేశారు. చిన్న పట్టణంలో న్యాయవాద వృత్తిని చేపట్టారు. ఆ తర్వాత అంచెలంచెలుగా దేశ న్యాయ వ్యవస్థలో అత్యున్నత పదవిని చేపట్టారు.
పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు న్యాయమూర్తిగా అనేక ముఖ్యమైన తీర్పులిచ్చారు. ఆ తర్వాత 2018 అక్టోబర్ 5న హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. కాగా, ప్రమాణ స్వీకారం పూర్తయిన తర్వాత జస్టిస్ బీఆర్ గవాయ్ సీజేఐ అధికారిక కారును జస్టిస్ సూర్యకాంత్‌కు అప్పగించారు. సీజేఐ హోదాలో జస్టిస్ కాంత్ సుప్రీంకోర్టుకు అధికారిక కారులోనే వెళ్లాలనే ఉద్దేశంతో ఈ విధంగా చేశారు. నిబంధనల ప్రకారం సీజేఐగా పదవీ విరమణ చేసిన అనంతరం మాజీ సీజేఐలు తాము ఉంటున్న అధికారిక నివాసాలను, ప్రభుత్వం కల్పించే సౌకర్యాలను వీడాల్సి ఉంటుంది.
జస్టిస్ సూర్యకాంత్ సభ్యునిగా గల ధర్మాసనాలు అత్యంత ముఖ్యమైన, రాజ్యాంగ ప్రాధాన్యం గల వివాదాలపై తీర్పులిచ్చాయి. జమ్ముకశ్మీరుకు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన అధికరణ 370ని రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన ధర్మాసనంలో ఆయన ఉన్నారు. ఎలక్టోరల్ బాండ్ల పథకం రాజ్యాంగ విరుద్ధమని, పెగాసస్ స్పైవేర్ కేసు, రాజద్రోహం చట్టాన్ని నిలిపేస్తూ ఇచ్చిన తీర్పుల్లో ఆయన భాగస్వామ్యం ఉంది. ఎన్నికల కమిషన్ బీహార్‌లో ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ద్వారా తొలగించిన 65 లక్షల మంది పేర్లను బహిర్గతం చేయాలని తీర్పు ఇచ్చిన బెంచ్‌లో ఆయన సభ్యుడిగా ఉన్నారు.
సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్‌తోపాటు దేశంలోని అన్ని బార్ అసోసియేషన్లలోనూ మూడింట ఒక వంతు సీట్లను మహిళలకు రిజర్వు చేయాలని ఆయన బెంచ్ తీర్పునిచ్చింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై ఆయన వ్యవహరించే తీరుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటి వరకు ఆయన ధర్మాసనం సర్ విధానం పారదర్శకంగా, ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పింది. సర్ రాజ్యాంగ బద్ధమేనా? కాదా? అనే అసలు సమస్యను ఇంకా పరిష్కరించలేదు.
సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్ తొలి రోజు 17 కేసులను విచారించారు. ఓ కొత్త విధాన నిర్ణయాన్ని తీసుకొచ్చారు. అత్యవసర లిస్టింగ్ కేసులను రాతపూర్వకంగా సమర్పించాల్సి ఉంటుంది. మరణశిక్ష, వ్యక్తిగత స్వేచ్ఛకు విఘాతం వంటి అసాధారణ పరిస్థితుల్లోనే మౌఖిక అభ్యర్థనలను అనుమతించనున్నారు.
జాతీయ న్యాయ సేవల ప్రాధికార సంస్థ (ఎన్ఏఎల్ఎస్ఏ) ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా జస్టిస్ విక్రమ్‌నాథ్ నియమితులయ్యారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. దేశంలోని అత్యంత బలహీన వర్గాలకు న్యాయం చేరువయ్యేందుకు జరుగుతున్న కృషి ఆయన నియామకం వల్ల మరింత ఊపందుకుంటుందని భావిస్తున్నారు. న్యాయస్థానాలను ఆశ్రయించే స్థోమత లేని వారికి నల్సా అండగా నిలుస్తుంది. అందరికీ న్యాయం కోసం రాజ్యాంగం ఇచ్చిన హామీని నిలబెట్టేందుకు నల్సా కృషి చేస్తుంది.