న్యూఢిల్లీ: భారతదేశంలో రాజ్యాంగమే అత్యున్నతమైనదని జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ చెప్పారు. ఆయన ఈ నెల 14న భారత ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆయన ఆదివారం తన నివాసంలో విలేకర్లతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. పార్లమెంటు, న్యాయ వ్యవస్థ గురించి ఉప రాష్ట్రపతి, కొందరు రాజకీయ నేతలు చేసిన వ్యాఖ్యలను విలేకర్లు ప్రస్తావించినపుడు జస్టిస్ గవాయ్ స్పందిస్తూ, ‘రాజ్యాంగమే అత్యున్నతమైనది. కేశవానంద భారతి కేసులో 13 మంది న్యాయమూర్తుల ధర్మాసనం ఇచ్చిన తీర్పులో ఈ విషయం చెప్పింది’ అన్నారు. న్యాయమూర్తులు పదవీ విరమణ అనంతరం గవర్నర్ వంటి పదవులను పొందడం గురించి ప్రస్తావించినపుడు గవాయ్ మాట్లాడుతూ, ‘నాకు రాజకీయ ఆకాంక్షలు లేవు. పదవీ విరమణ తర్వాత నేను ఏ పదవులూ స్వీకరించను’ అని తెలిపారు.
మాజీ సీజేఐకి గవర్నర్ పదవి ప్రొటోకాల్ ప్రకారం దిగువ స్థాయిలోనిదని చెప్పారు. న్యాయమూర్తులు ఇతరులను, రాజకీయ నేతలను కలుస్తుండటం గురించి మాట్లాడుతూ, ఓ న్యాయమూర్తిగా ఏకాకిలా బతకలేమని చెప్పారు. వివిధ రంగాల వ్యక్తులను కలవకపోతే, వారి సమస్యలను అర్థం చేసుకోలేమని తెలిపారు. తాను మణిపూర్లో పర్యటించినపుడు ఓ వృద్ధురాలు తన ఇంట్లోకి ఆహ్వానించారని, అప్పుడు మన దేశ ఐకమత్యం, స్నేహ సంబంధాల గురించి తెలుసుకోగలిగానని చెప్పారు. జస్టిస్ గవాయ్ మన దేశంలో సీజేఐ పదవిని చేపట్టే మొదటి బౌద్ధ మతస్థుడు కావడం విశేషం.