మంగళవారం 26 జనవరి 2021
National - Dec 28, 2020 , 17:16:45

కరోనా కాలంలో.. జుగాడ్‌ పరిష్కారాలు

కరోనా కాలంలో.. జుగాడ్‌ పరిష్కారాలు

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా లాక్‌డౌన్‌ విధించడంతో చాలా రోజుల పాటు ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు మూతపడ్డాయి. వ్యాపారాలు, వ్యవహారాలన్నీ పక్కకు వెళ్లిపోయాయి. పెండ్లిళ్లు పేరాంటాలు బంద్‌ అయిపోయాయి. విద్యార్థుల చదువులు అటకెక్కాయి. చాలా సంస్థలు తమ ఉద్యోగులను ఇంటి నుంచే పనిచేసేందుకు అనుమతించాయి. ఈ నేపథ్యంలో ఇంటిపని, బయటిపని, చదువుపని, ఇతరత్రాలకు భయపడుతూ బ్రతకాల్సిన రోజుల్లో.. ప్రత్యేకమైన సమస్యలకు ప్రత్యేకమైన పరిష్కారాలు అందుబాటులోకి వచ్చాయి. అదృష్టవశాత్తూ మన వాళ్లు జుగాడ్‌ మాస్టర్స్ కాకపోయి ఉంటే.. కొత్త ఆవిష్కరణలు మనం చూసేవారం కామేమో! తమకు అందుబాటులో ఉన్న చిన్నచిన్న వస్తువులతో జుగాడ్‌లను తయారుచేసి ఔరా అనిపించారు. 2020 లో వైరల్ అయిన జుగాడ్ లేదా క్రియేటివ్ వస్తువుల ఐదు ఉదాహరణలను ఇప్పుడు చూద్దాం.

ఫ్రిజ్‌ ట్రేతో పాఠాలు


ఆన్‌లైన్ క్లాస్ సమయంలో మ్యాథ్స్‌ పాఠాలు చెప్పడం టీచర్లకు చాలా ఇబ్బందిగా తయారైంది. ఓ ఉపాధ్యాయురాలు దీనికి రిఫ్రిజిరేటర్ ట్రే ఉపయోగించి పిల్లలకు చక్కగా అర్థమయ్యేట్లు లెక్కలు బోధించింది. ఫ్రిజ్‌లో ఉండే ట్రాన్స్‌పరెన్సీ ట్రేని రెండు డబ్బాలపై ఉంచి దానిపైన స్మార్ట్‌ఫోన్‌ను పెట్టి.. క్రింద టేబుల్‌పై ఉంచిన కాగితంపై గణితం లెక్కలను పరిష్కరించే ఫొటో తీసి విద్యార్ధులకు చేరవేసింది. ఈ వినూత్న జుగాడ్‌ ఆమె తన ఫోన్‌ను చేతితో పట్టుకోవలసిన అవసరాన్ని తొలగించింది. లెక్కను పరిష్కరించేటప్పుడు విద్యార్థులను చూడటానికి కూడా వీలు కల్పించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ కావడంతో సదరు మ్యాథ్స్‌ టీచర్‌ను పొగడ్తల్లో ముంచెత్తారు.

హ్యాంగర్‌తో ట్రైప్యాడ్‌


పుణెకు చెందిన ఓ కెమిస్ట్రీ లెక్చరర్‌.. తన విద్యార్థులకు పాఠాలు బోధించేందుకు తగిన పరికరాలు లేకపోవడంతో కొత్తగా ఆలోచించి ట్రైప్యాడ్‌ను సిద్ధం చేసుకున్నది. హ్యాంగర్‌కు మొబైల్‌ ఫోన్‌ను వేలడదీసి.. హ్యాంగర్‌ను కదలకుండా ఉండేలా పైన, కింద తాళ్లతో కట్టేసింది. ఎంచక్కా ట్రైప్యాడ్‌ తయారుకావడంతో క్లాస్‌రూం పాఠాలను ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తిచేసింది. ఈ టీచర్‌ సృజనాత్మకతకు జోహార్‌ చెప్పాల్సిందే కదూ!

ఆటోమెటిక్‌ పానీ పూరీ మెషిన్‌


కరోనా వైరస్‌ నేపథ్యంలో ఫాస్ట్‌ పుడ్‌ సెంటర్లు, హోటళ్లు అన్నీ మూతపడ్డాయి. దాంతో సాయంత్రం వేళ పానీపూరీ తినేవారు చాలా అవస్థలు పడ్డారు. ముట్టుకోకుండా, నిర్ణతీ దూరం పాటిస్తూ పానీపూరీ తినడం అయ్యేదికాదు. పానీపూరీ ప్రియుల కోసం రాయ్‌పూర్‌లోని ఓ రెస్టారెంట్ యాజమాన్యం.. 'టచ్‌ మీ నాట్‌ పానీపూరీ' అనే ఆటోమెటిక్‌ పానీపూరీ బండిని సిద్ధం చేసింది. ఇందులో పూరీని పెట్టగానే ఆటోమెటిక్‌గా పుదీనా, అల్లం, కఠామీఠా నీరు పడుతుంది. ఇది పానీపూరీ ప్రియులనే కాకుండా వైరల్‌గా మారి ఎందరి నోళ్లలోనో నానుతున్నది.

పాలు కావాలా.. అక్కడ పట్టు


కరోనా సమయంలో పాలు పోసేందుకు ఎవరూ రాకపోవడంతో ఇంటిల్లిపాది చాయ్‌ లేక ఇబ్బందిపడ్డారు. ఈ అవస్థలను గమనించిన ఓ వ్యక్తి తన వాహనానికి పైపు, గరాటతో పరిష్కారం చూపారు. నిర్ణీత దూరంలో ఉండి పాలు పట్టుకునేలా ఏర్పాట్లు చేసి శహబాష్‌ అనిపించుకున్నాడు. సమస్యల నుంచే పరిష్కార మార్గాలు లభిస్తాయనడానికి ఇదే చక్కటి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. 

ఇస్త్రీ చేసి వైరస్‌ను చంపుతా!


కరోనా సమయంలో దేన్ని ముట్టుకున్నా వైరస్‌ అంటుకుంటుందోమో అన్న భయంలో ప్రజలు ఉండేవారు. అలాగే వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసేవారు ఏదైనా ముట్టుకోవాలంటే భయపడిపోయేవారు. అక్కడ పెట్టి వెళ్లిపోండి అంటూ హూంకరించేవారు. అయితే, బ్యాంకుల్లో పనిచేసే వారికి చెక్కుల క్లియరెన్సులు చేయడం, నగదు బదిలీలు చాలా సమస్యగా తయారైంది. దాంతో ఓ బ్యాంకు క్యాషియర్ కొత్తగా ఆలోచించి తన వద్దకు వచ్చే చెక్కులు, నగదును చిమ్మెటతో పట్టుకుని ఇస్త్రీపెట్టెతో వేడి చేసి వైరస్‌ చంపేయడం చేశాడు. ఈయన తతంగం మొదట్లో కొత్తగా అనిపించినా.. రాన్రాను వైరస్‌ అంటుకోకుండా ఆయన చేసిన జుగాడ్‌ ప్రక్రియ వైరల్ గా మారింది.

ఇవి కూడా చదవండి..

2022 నాటికి లక్షల ఉద్యోగాలు.. ఏయే రంగాల్లో తెలుసా?

2020 లో 20 గుణపాఠాలు..! అవేంటో తెలుసా?

అమ్మకానికి స్వచ్ఛమైన గాలి.. బాటిల్‌ ధర ఎంతంటే..?

900 బిలియ‌న్ డాలర్ల‌ బిల్లుపై ట్రంప్ సంత‌కం..

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo