జైపూర్: ఉన్నత న్యాయస్థానాల్లో న్యాయమూర్తుల నియామకాలకు అనుసరిస్తున్న కొలీజియం విధానంపై సర్వోన్నత న్యాయస్థానం, కేంద్ర ప్రభుత్వం మధ్య తీవ్ర వివాదం నడుస్తున్న వేళ ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. జడ్జీల నియామకాల కోసం కేంద్రం ప్రతిపాదించిన జాతీయ న్యాయ నియామకాల కమిషన్ను (ఎన్జాక్) సుప్రీంకోర్టు రద్దు చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. ఇది ప్రపంచ ప్రజాస్వామ్య చరిత్రలోనే ఎన్నడూ ఎరుగనిదని వ్యాఖ్యానించారు. రాజ్యాంగాన్ని పార్లమెంట్ సవరించొచ్చని, కానీ రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చడానికి వీలు లేదని కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో తాను ఏకభవించడం లేదని అన్నారు. పార్లమెంట్ ఆమోదించిన చట్టాన్ని ఏదైనా వ్యవస్థ రద్దు చేయడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు.
జైపూర్లోజరుగుతున్న ఆలిండియా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ సదస్సులో పాల్గొన్న ధన్కర్.. పార్లమెంటరీ సార్వభౌమత్వం న్యాయవ్యవస్థ ముందు రాజీపడకూడదని పేర్కొన్నారు. ఇంకో వ్యవస్థపై పెత్తనం చెలాయించాలనుకోవటం న్యాయవ్యవస్థకు మంచిది కాదన్నారు. ఇలాంటి వ్యవస్థలు తమకుతాము ఎలా ప్రవర్తించాలో కచ్చితంగా తెలుసుకోవాలన్నారు. ప్రభుత్వ పెద్దలు ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా సంయమనం పాటించాలని కోర్టు ఇటీవల సూచించినప్పటికీ ఆయన మరోసారి అవే వ్యాఖ్యలు చేయడం గమనార్హం. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా మాట్లాడుతూ.. న్యాయవ్యవస్థ, శాసన వ్యవస్థ కచ్చితంగా అధికార సమతుల్యత పాటించాలని అన్నారు. ఎవరి అధికారాలను వారి పరిధిలోనే వినియోగించుకోవాలని చెప్పారు. శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలు సామరస్యకపూర్వక వాతావరణంలో పనిచేయాలని సూచించారు.