న్యూఢిల్లీ: బంగారం స్మగ్లింగ్ కేసులో కన్నడ నటి రాన్యారావు(Ranya Rao)తో పాటు తరుణ్ రాజు, సాహిత్జైన్ జుడిషియల్ కస్టడీని పొడిగించారు. ఏప్రిల్ 21 వరకు కస్టడీ పొడిగిస్తూ కోర్టు ఆదేశౄలు ఇచ్చింది. ఇటీవల బెంగుళూరు విమానాశ్రయంలో సుమారు 15 కేజీల బంగారం స్మగ్లింగ్ చేస్తూ రాన్యారావు పట్టుబడిన విషయం తెలిసిందే. డైరెక్టరేట్ ఆఫ్ రెవన్యూ ఇంటెలిజెన్స్ ఈ కేసును విచారిస్తున్నది. అక్రమంగా బంగారాన్ని స్మగ్లింగ్ చేయడం వల్ల సుమారు 5 కోట్ల కస్టమ్స్ సుంకం నష్టపోయినట్లు అధికారులు చెప్పారు. రాన్యారావుకు సాహిల్ సాకరియా జెయిన్ అనే వ్యక్తి సహకరించాడు.
స్మగ్లింగ్ చేసిన బంగారాన్ని అమ్మే రీతిలో అతను ప్లాన్ సెటిల్ చేసినట్లు తెలుస్తోంది. ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు బృందాలు విచారణ చేపడుతున్నాయి. హవాలా పద్ధతిలో అక్రమంగా బంగారాన్ని తెచ్చినట్లు విచారణలో రాన్యారావు అంగీకరించిన విషయం తెలిసిందే. మార్చి 3వ తేదీన కెంపగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
ఆమె వద్ద నుంచి 14.8 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. సెక్షన్ 108 కింద డీఆర్ఐ అధికారులు ఆమెపై విచారణ చేపడుతున్నారు.