న్యూఢిల్లీ, ఫిబ్రవరి 3: ఓ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి అమెజాన్‌కు చెందిన ఈ-రీడింగ్ వేదిక ‘కిండల్’, పాపులర్ డేటింగ్ యాప్ ‘టిండర్’ పదాల మధ్య కొంత గందరగోళానికి గురి కావడం కోర్టు రూమ్‌లో నవ్వులు పూయించింది. గ్రామీణ ప్రజల్లో చదివే అలవాటును ప్రోత్సహించేందుకు గ్రామాల్లో లైబ్రరీలు ఏర్పాటు చేయాలని కోరుతూ దాఖలైన పిల్‌పై జస్టిస్ పీవీ సంజయ్ కుమార్, జస్టిస్ అనిరుద్ధ బోస్ విచారణ జరిపారు.
ఈ సందర్భంగా ఈ-లైబ్రరీలు, పుస్తకాల డిజిటలైజేషన్‌కు సంబంధించిన ప్రణాళికలు జరుగుతున్నాయని అడిషనల్ సొలిసిటర్ జనరల్(ఏఎస్జీ) విక్రమ్‌జిత్ బెనర్జీ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన జస్టిస్ సంజయ్ కుమార్ ‘కొత్త పేజీని తిప్పడంలో కలిగే అనుభూతి, అనందం.. డిజిటల్ రీడింగ్‌లో ఎక్కడుంటుంది? దానిని మీరు ఏమని పిలుస్తారు? టిండర్?’ అని అడిగారు. దీనికి ‘తాను చెబుతున్నది కిండల్ గురించి..’ అంటూ ఏఎస్జీ న్యాయమూర్తి వ్యాఖ్యలను సరిచేశారు. ప్రతిగా.. ‘అవునవును. టిండర్ అనేది డేటింగ్ యాప్ కదా!’ అంటూ జస్టిస్ సంజయ్ కుమార్ నవ్వుతూ బదులివ్వడంతో కోర్టులో నవ్వులు పూశాయి.