Jnanpith Award | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17: మధ్యప్రదేశ్ తులసీపీఠం వ్యవస్థాపకులు, ఆధ్యాత్మికవేత్త రామభద్రాచార్య, ప్రముఖ ఉర్దూ కవి, హిందీ సినీ గేయ రచయిత గుల్జార్‌లను జ్ఞానపీఠ్ పురస్కారం వరించింది. 58వ జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీతల పేర్లను ఎంపిక కమిటీ శనివారం ప్రకటించింది. 2023 ఏడాదికిగాను రామభద్రాచార్య, గుల్జార్‌లను ఎంపిక చేసినట్టు అవార్డు కమిటీ తెలిపింది. హిందీ సినీ గేయ రచయితగా, ఉర్దూ కవిగా గుల్జార్ అనేక అవార్డులు, పురస్కారాలను పొందా రు.
సాహితీ ప్రపంచంలో తనదైన ముద్రవేశారు. 2013లో దాదాసాహెబ్ ఫాల్కే, 2004లో పద్మభూషణ్, ఐదుసార్లు జాతీయ ఫిల్మ్ అవార్డులను గుల్జార్ అందుకున్నారు. మరోవైపు జగద్గురు రామభద్రాచార్య బాల్యం నుంచి అంధుడైనప్పటికీ, బ్రెయిలీ లిపి సాయం లేకుండా వివిధ భాషల్లో ప్రావీణ్యం సంపాదించారు. సంస్కృతం, అవధి, మైథిలి..తదితర భాషల్లో అశువుగా కవిత్వం చెప్పగలరు. 100కుపైగా పుస్తకాలను రచించారు. తులసీదాస్ పేరు మీద చిత్రకూట్‌లోని మత, సామాజిక సేవా సంస్థ తులసీ పీఠ్ వ్యవస్థాపకులు, అధిపతిగా ఉన్నారు.