రాంచీ: జార్ఖండ్‌లోని పారస్నాథ్ హిల్స్‌లో ఉన్న శ్రీ సమ్మేద్ శిఖర్జీ ఆలయం ఇప్పుడు వివాదంగా మారింది. అది జైనులు మందిరం. అయితే ఆ ప్రాంతాన్ని టూరిజం కేంద్రంగా ప్రకటించారు. ఆ ప్రకటనపై స్థానిక గిరిజన సంఘాలు గుర్రుగా ఉన్నాయి. గిరిది జిల్లాలో ఉన్న ఆ కొండ ప్రాంతం గిరిజన దైవమైన మరంగ బురుకు చెందినదని, ఒకవేళ ప్రభుత్వం తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుంటే భారీ నిరసనలు చేపడుతామని గిరిజనులు హెచ్చరించారు.
పారస్నాథ్ కొండల్లో ఉన్న సుమారు 10 కిలోమీటర్ల విస్తీర్ణ ప్రాంతం తమదే అని జైనులు చెబుతున్నారు. కానీ ఆ ప్రాంతంలో గిరిజనులు ఎప్పటి నుంచో మరంగ బురు దైవానికి బలి ఇచ్చే వేడుకల్ని నిర్వహిస్తున్నారు. ఒకవేళ ఇప్పుడు ఆ ప్రాంతంలో టూరిజం ఆంక్షలు చేపడితే అప్పుడు గిరిజన దేవుడికి ఉత్సవాలను నిర్వహించలేమని గిరిజనులు ఆరోపిస్తున్నారు.
జేఎంఎం ఎమ్మెల్యే లోబియన్ హేమ్‌బ్రమ్ కూడా పారస్నాథ్ హిల్స్‌ను జైనులకు ఇవ్వడాన్ని తప్పుపట్టారు. ఆ ప్రాంతం గిరిజనులదే అని, దానికి సంబంధించిన లీగల్ డాక్యుమెంట్లు ఉన్నట్లు ఆయన తెలిపారు. మరంగ బురును ఆదివాసీల కొండగా పిలుస్తారని, జైనులు దాన్ని స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారని, దీంతో స్థానికుల్ని రూపుమాపాలని చూస్తున్నట్లు ఎమ్మెల్యే ఆరోపించారు.
పారస్నాథ్ హిల్స్‌ను జైన టూరిజం ప్రాంతంగా ప్రకటించరాదు అని, జనవరి 25వ తేదీ వరకు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆల్టిమేటం ఇస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. ఒకవేళ ప్రభుత్వం తమ నిర్ణయాన్ని మార్చుకోకుంటే, అప్పుడు జార్ఖండ్, బీహార్, బెంగాల్, అస్సాం, ఒడిశాలకు చెందిన గిరిజనులు నిరసన ప్రదర్శన చేపట్టనున్నట్లు తెలిపారు.