రాంచీ, నవంబర్ 28: ఢిల్లీలోని శ్రద్ధా వాకర్ హత్య తరహాలో జార్ఖండ్లో మరో దారుణం చేటు చేసుకుంది. మాంసం అమ్మే వృత్తిలో ఉన్న ఒక యువకుడు తనతో సహ జీవనం చేస్తున్న మహిళని హత్య చేసి ముక్కలు ముక్కలుగా నరికాడు. అనంతరం వాటిని ఒక అటవీ ప్రాంతంలో పలు చోట్ల పారేశాడు. ఈ దారుణ సంఘటన జార్ఖండ్లో చోటుచేసుకుంది.
తమిళనాడుకు చెందిన 26 ఏండ్ల నరేశ్ భెంగ్రా.. తన జిల్లాకే చెందిన 24 ఏండ్ల ఒక మహిళతో గత రెండేండ్లుగా సహ జీవనం చేస్తున్నాడు. కొద్దికాలం క్రితం వీరు జార్ఖండ్ లోని కుంతీకి వచ్చారు. అయితే ఆమెకు చెప్పకుండా నరేశ్ మరో మహిళను పెండ్లి చేసుకున్నాడు.
తర్వాత ఆమె తనకు అడ్డుగా ఉంటుందని భావించాడే ఏమో.. ఈ నెల 8న జోర్డాగ్ గ్రామ సమీపంలోని అడవిలోకి ఆమెను తీసుకెళ్లి లైంగిక దాడి చేసి, హత్య చేసి శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికాడు. సుమారు 40, 50 శరీర భాగాలను అడవిలో వివిధ ప్రదేశాలో పడేశాడు. అయితే మృతురాలి చేతిని ఒక కుక్క తింటుండగా చూసిన కొందరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ నెల 24న ఈ దారుణం వెలుగు చూసింది. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు నేరాన్ని అంగీకరించాడు.