రాంచీ, జూలై 13: ‘ఎలుకలు 802 సీసాల మద్యం తాగాయి. ఇందులో మా తప్పేమీ లేదు. మేం అక్రమాలకు పాల్పడలేదు. మద్యం దారి మళ్లించలేదు’ ఇదీ జార్ఖండ్లో మద్యం దుకాణాల నిర్వాహకులు ఎక్సైజ్ అధికారులకు చెప్పిన వివరణ. ఈ వాదన విని నివ్వెరపోవడం ఎక్సైజ్ అధికారుల వంతయింది. జార్ఖండ్లో నూతన మద్యం విధానం అమల్లోకి రానుంది. ప్రస్తుతం మద్యం దుకాణాలను ప్రభుత్వమే నిర్వహిస్తున్నది. ఇకపై లాటరీ ద్వారా ఎంపిక చేసిన ట్రేడర్స్కు దుకాణాల నిర్వహణ బాధ్యతలు అప్పగించనుంది.
ఈ నేపథ్యంలో ఎక్సైజ్ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులో ఉన్న మద్యం నిల్వలపై తనిఖీలు చేపట్టారు. ధన్బాద్ జిల్లా బలియాపూర్, ప్రధాన్కుంట ప్రాంతాల్లోని దుకాణాలలో నిల్వల్లో తేడాలు గుర్తించారు. 802 ఇండియన్ మేడ్ ఫారిల్ లిక్కర్(ఐఎంఎఫ్ఎల్) బాటిళ్లు దాదాపు ఖాళీగా కనిపించాయి.
ఇదేంటని అడిగితే బాటిళ్ల మూతలను ఎలుకలు కొరికి, మద్యం తాగేశాయని దుకాణాల నిర్వాహకులు చెప్పుకొచ్చారు. కానీ ఎక్సైజ్ అధికారులు మాత్రం నమ్మలేదు. ఖాళీ అయిన బాటిళ్లకు సంబంధించి జరిమానా విధించారు. గతంలో కూడా ధన్బాద్లో నిందితుల నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న 10 కేజీల బంగు, 9 కేజీల గంజాయి కనిపించకుండా పోయింది. అప్పట్లో ఈ వ్యవహారం కోర్టు వరకు వెళ్లింది.