Champai Soren | జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి చంపై సోరెన్ తన రాజకీయ భవితవ్యంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన బీజేపీలో చేరనున్నారన్న వార్తల నేపథ్యంలో ఆదివారం సోషల్ మీడియా వేదికగా భావోద్వేగ పూరిత వ్యాఖ్యలు చేశారు. తన ముందు మూడు మార్గాలు ఉన్నాయని ‘ఎక్స్’ ఖాతాలో పోస్టు చేశారు. ‘రాజకీయాల నుంచి పూర్తిగా వైదొలగడం, విడిగా రాజకీయ పార్టీ ఏర్పాటు చేయడం, కలిసి వచ్చే పార్టీతో కలిసిపని చేయడం’ అనే ఆప్షన్లు ఉన్నాయని పేర్కొన్నారు. తన ఆత్మ గౌరవానికి దెబ్బ తగిలిందని వ్యాఖ్యానించారు. దీంతో తన మనస్సుకు గాయమైందన్నారు.
అవినీతి కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేయడానికి ముందు జార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ రాజీనామా చేశారు. ఆయన స్థానంలో చంపై సోరెన్ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. ఇటీవలే బెయిల్ మీద బయటకు రాగానే చంపై సోరెన్ స్థానంలో తిరిగి హేమంత్ సోరెన్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. అర్థంతరంగా తనను సీఎం పదవి నుంచి తప్పించడం చంపై సోరెన్‌కు మనస్తాపం కలిగించినట్లు కనిపిస్తున్నది. బీజేపీలో చేరేందుకే ఢిల్లీ వచ్చారన్న వదంతులను ఆయన కొట్టి పారేశారు. ఢిల్లీలో ఉన్న తన కూతుర్ని కలవడానికి మాత్రమే వచ్చానని చెప్పారు.