రాంచీ: సహాయకుడు తనపై కాల్పులు జరిపేందుకు ప్రయత్నించినట్లు బీజేపీ నాయకురాలు (Sita Soren) ఆరోపించింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో ఆమె సహాయకుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. దేశీయ తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. జార్ఖండ్‌లోని ధన్‌బాద్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. సీఎం హేమంత్ సోరెన్ వదిన, బీజేపీ నాయకురాలు సీతా సోరెన్ ఒక పెళ్లి కార్యక్రమానికి హాజరయ్యేందుకు మార్చి6న ధన్‌బాద్ చేరుకున్నది. ఆ వేడుక తర్వాత రాత్రికి బస చేసేందుకు హోటల్‌కు వెళ్లింది.
కాగా, ఒక అంశంపై కారు డ్రైవర్ ఘోష్, సీతా సోరెన్ మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో అతడు గన్ ఎక్కుపెట్టి తనపై కాల్పులు జరిపేందుకు ప్రయత్నించినట్లు ఆమె ఆరోపించింది. తన గార్డ్ వెంటనే స్పందించి అతడ్ని అడ్డుకున్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ హాటల్ వద్దకు చేరుకున్న పోలీసులు ఘోష్‌ను అరెస్ట్ చేసినట్లు పోలీస్ అధికారి తెలిపారు. అతడి నుంచి దేశీయ తుపాకీని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.
మరోవైపు జేఎంఎం చీఫ్ శిబూ సోరెన్ కోడలైన సీతా సోరెన్ ఆ పార్టీ నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచింది. గత ఏడాది మార్చిలో ఆమె బీజేపీలో చేరింది. గత ఏడాది నవంబర్‌లో జరిగిన జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో జామ్తారా స్థానం నుంచి పోటీ చేసింది. అయితే జేఎంఎం అభ్యర్థి చేతిలో ఆమె ఓడిపోయింది.