Bomb threat : బాంబు బెదిరింపు నేపథ్యంలో జెడ్డా నుంచి హైదరాబాద్‌కు వస్తున్న ఇండిగో విమానాన్ని దారి మళ్లించారు. హైదరాబాద్ ఎయిర్ పోర్టులో ల్యాండ్ చేయకుండా ముంబైకి తీసుకెళ్లారు. అక్కడ సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్ నేషనల్ ఎయిర్ పోర్టు అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఎయిర్ పోర్టు అధికారులకు శనివారం ఉదయం 5.30 గంటల ప్రాంతంలో ఓ మెయిల్ వచ్చింది. ఆ మెయిల్లో ‘జెడ్డా నుంచి హైదరాబాద్ వస్తున్న ఇండిగో ఫ్లైట్ 6E 68లో మానవ బాంబు ఉందని రాసి ఉంది.
1984లో మద్రాస్ ఎయిర్ పోర్టులో జరిగిన బాంబు దాడి తరహాలో ఈ దాడి జరుగుతుందని, ఎల్టీటీఈ, ఐఎస్ఐ ఈ దాడికి ప్లాన్ చేశాయని ఆ మెయిల్లో పేర్కొన్నారు. దాంతో ఎయిర్‌పోర్టు అధికారులు అప్రమత్తమయ్యారు. విమానం పైలెట్‌కు సమాచారం ఇచ్చారు. ముంబైలో ల్యాండ్ చేయాలని సూచించారు. ఇండిగో అధికార ప్రతినిధి ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేశారు.
‘నవంబర్ 1న ఇండిగో విమానం 6E 68కు బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. దాంతో జెడ్డా నుంచి హైదరాబాద్ రావాల్సిన విమానం ముంబై వెళ్లిపోయింది. ప్రోటాకాల్ ప్రకారం మేము సంబంధిత అధికారులకు విషయం చేరవేశామని, వారికి పూర్తిగా సహకరించి సెక్యూరిటీ చెక్స్ పూర్తి చేశామని పేర్కొన్నారు.