(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్ (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల ముఖ్య ఉద్దేశం పేద ప్రజల సంక్షేమం కాదని, కేవలం ప్రధాని మోదీ ప్రచారమేనని ప్రముఖ సామాజిక కార్యకర్త, ఆర్థికవేత్త జాన్ ద్రీజ్ ధ్వజమెత్తారు. ఓ ఆంగ్ల వెబ్‌సైట్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మోదీ ప్రభుత్వంపై ఆయన సునిశిత విమర్శలు చేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్ కేటాయింపుల్లో కేంద్రం సామాజిక భద్రత పథకాలకు పెద్దఎత్తున కోత విధించిందని తెలిపారు. బడ్జెట్లో ఆహార సబ్సిడీలో కోత విధించిందని వెల్లడించారు.
ఎన్నికల్లో లబ్ధికే..
జాతీయ ఆహార భద్రత చట్టం కింద 81.35 కోట్ల మందికి ఏడాదిపాటు ఆహార ధాన్యాలు ఉచితంగా పంపిణీ చేయనున్నట్టు ఎన్నికల ముందు కేంద్రం ప్రకటన వెనుక రాజకీయ లబ్ధే ముఖ్య కారణమని పేర్కొన్నారు.
ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చే కుట్ర
కేంద్రం ఇటీవలి బడ్జెట్లో ఉపాధి హామీ పథకానికి కూడా 33 శాతం నిధులను తగ్గించిందని, ఇందులో రూ.10 వేల కోట్ల వేతన బకాయిలు చెల్లిస్తే ఇక మిగిలేవి ఎంతని ద్రీజ్ ప్రశ్నించారు. ఉపాధి హామీ పథకంలో డిజిటల్ హాజరు విధానం ప్రవేశపెట్టడంతో ఆచరణలో ఉత్పన్నమయ్యే సమస్యల వల్ల గ్రామీణ ప్రాంతాల్లో కార్మికులు నిరుత్సాహంతో పనికి వెళ్లడమే మానేస్తున్నారని తెలిపారు.
జాన్ ద్రీజ్ నేపథ్యం
బెల్జియంలో జన్మించిన జాన్ ద్రీజ్ ఢిల్లీలోని ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్లో పీహెచ్డీ పూర్తి చేశారు. 1979 నుంచి భారత్‌లో జీవిస్తున్న ఆయన 2002లో భారతీయ పౌరసత్వాన్ని తీసుకున్నారు. ప్రస్తుతం రాంచీ యూనివర్సిటీ విజిటింగ్ ప్రొఫెసర్‌గా, ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో హానరరీ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. ఆయన పలు సామాజిక ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొంటారు. భారత్‌లో ఆహార భద్రత, ప్రజా సంక్షేమం, లింగవివక్ష, గ్రామీణాభివృద్ధి, ప్రాథమిక విద్య, పిల్లల్లో పోషకాహారం వంటి అంశాలపై పని చేస్తున్నారు.
సొంత ఖర్చుతో పేదలను ఆదుకుంటున్న రాష్ర్టాలు
గడువు ప్రకారం 2021లో జనగణన చేపట్టి ఉంటే పేద కుటుంబాల సంఖ్య మరింత పెరిగి ఉండేదని ఆయన పేర్కొన్నారు. గత పదేండ్లలో పెండ్లిళ్లు చేసుకొని వేరు కాపురం పెట్టిన పేద కుటుంబాలు రేషన్ అందక ఇబ్బందులు పడుతున్నాయని తెలిపారు. మరికొన్ని పేద కుటుంబాలను సామాజిక, ఆర్థిక, కులగణన డాటాలో ఖాళీలు, తప్పుల వంటి కారణాలతో జాతీయ ఆహార భద్రత చట్టం జాబితాలోంచి తొలగించడంతో ఆహార ధాన్యాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని రాష్ర్టాలు తమ సొంత ఖర్చులతో పేద కుటుంబాలకు రేషన్ కార్డులు జారీ చేసి, ఆహార ధాన్యాలు అందిస్తున్నా.. కేంద్రం బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తున్నదని మండిపడ్డారు.