JD(U) పాట్నా : నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి హాజరైన రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివన్ష్పై జేడీయూ అధికార ప్రతినిధి నీరజ్ కుమార్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి హాజరు కావొద్దని జేడీయూ అధికారికంగా ఆదేశాలు జారీ చేసినప్పటికీ, ఆ పార్టీ రాజ్యసభ నాయకులు హరివన్ష్ హాజరు కావడాన్ని పార్టీ తప్పుబట్టింది.
ఈ సందర్భంగా నీరజ్ కుమార్ మాట్లాడుతూ.. పార్లమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మనే హాజరు కాలేదని, మీరు ఎలా హాజరవుతారని ప్రశ్నించారు. మీరు జర్నలిజంలో చేసిన సేవలను గుర్తించి, జేడీయూ మీకు రాజకీయాల్లో అవకాశం కల్పించి, రాజ్యసభకు పంపించిందని గుర్తు చేశారు. కానీ పార్లమెంటరీ ప్రజాస్వామ్య చరిత్రలో ఈ చీకటి రోజున, ఉన్నత పదవులను ఆశించి, ఆ ప్రారంభోత్సవానికి వెళ్లడం సరికాదన్నారు. ఈ అంశంపై పార్టీ త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందని నీరజ్ కుమార్ స్పష్టం చేశారు.
కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ కాకుండా, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేత ప్రారంభింపజేయాలని విపక్ష పార్టీలు పట్టుపట్టాయి. కానీ మోదీ రాష్ట్రపతిని ఆహ్వానించకపోవడంతో.. పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని దాదాపు 20 పార్టీలు బహిష్కరించాయి.