బెంగళూరు: కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ (Kichcha Sudeep) సినిమాలు, టీవీ షోలు, వాణిజ్య ప్రకటనల ప్రసారాలపై నిషేధం విధించాలని డిమాండ్ చేస్తూ జనతాదళ్-సెక్యులర్ (JD-S) పార్టీ.. ఎన్నికల సంఘానికి (Election Commission) లేఖ రాసింది. ఆయన సినిమాలు, షోలు, ప్రకటనల ప్రసారాలు కొనసాగితే వచ్చే నెలలో జరుగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలపై తీవ్ర ప్రభావం పడుతుందని ఈసీకి రాసిన లేఖలో జేడీఎస్ ఆందోళన వ్యక్తం చేసింది.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తాను బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేస్తానని గత బుధవారం కిచ్చా సుదీప్ ప్రకటించాడు. దాంతో అతను బీజేపీలో చేరుతున్నాడని ప్రచారం జరిగింది. కానీ, తాను పార్టీలో చేరడం లేదని, సీఎం మామ (కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై)పై అభిమానంతో కొందరు తెలిసిన అభ్యర్థుల తరఫున ప్రచారం మాత్రమే చేయబోతున్నానని కిచ్చా క్లారిటీ ఇచ్చాడు.
ఈ నేపథ్యంలో బీజేపీకి మద్దతు ప్రకటించిన సుదీప్ సినిమాలు, షోలు, ప్రకటనల ప్రసారం కొనసాగితే బీజేపీకి లాభం చేకూరి, ఇతర పార్టీలకు నష్టం జరుగుతుందని భావించిన జేడీఎస్ ఈసీకి లేఖ రాసింది. కాగా, వచ్చే నెల 10న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. వచ్చే నెల 13న ఓట్లను లెక్కించి ఫలితాలు వెల్లడించనున్నారు.