Jayanth Chaudhary: ఉత్తప్రదేశ్‌లో ప్రతిపక్ష ‘INDIA’ కూటమికి గట్టి షాక్ తగిలింది. ‘INDIA’ కూటమిలో భాగస్వామిగా ఉన్న రాష్ట్రీయ లోక్‌దళ్ (RLD) వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో NDA కూటమి తరఫున బరిలో దిగబోతున్నది. ఆర్ఎల్డీ చీఫ్ భారత మాజీ ప్రధాని చౌదరి చరణ్‌సింగ్ మనవడు జయంత్ సింగ్ చౌదరి సంకేతాలిచ్చారు.
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తమతో కలిసి నడిస్తే రెండు లోక్‌సభ సీట్లిస్తామని, ఎన్నికల తర్వాత ఒకరిని రాజ్యసభకు పంపుతామని ఇటీవల జయంత్ చౌదరికి బీజేపీ ఆఫర్ చేసింది. అయితే ‘INDIA’ కూటమిలో ఉన్న జయంత్ చౌదరి బీజేపీ ఆఫర్‌పై ఇప్పటివరకు ఎలాంటి స్పందన తెలియజేయలేదు. ఈ నేపథ్యంలో తాజాగా కేంద్ర ప్రభుత్వం జయంత్ తాత, భారత మాజీ ప్రధాని చరణ్‌సింగ్‌కు భారతరత్న అవార్డు ప్రకటించింది.
కేంద్రం ప్రకటనపై జయంత్ చౌదరి ఆనందం వ్యక్తంచేశారు. తన చిరకాల స్వప్నం నెరవేరిందని అన్నారు. ఈ క్రమంలో జయంత్‌ను మీడియా పలకరించింది. మీ తాతకు కేంద్రం భారతరత్న ప్రకటించిన నేపథ్యంలో బీజేపీ ఆఫర్‌పై స్పందన ఏమిటని ప్రశ్నించింది. దాంతో ‘ప్రస్తుత సందర్భంలో ఓట్లు, సీట్ల అంశం అంత ముఖ్యమైనది కాదు’ అని జయంత్ వ్యాఖ్యానించారు.
అయినా మీడియా విడిచిపెట్టలేదు. అయితే మీరు ‘INDIA’ కూటమిలోనే ఉండబోతున్నారా..? బీజేపీ ఆఫర్‌ను తిరస్కరిస్తున్నారా..?’ అని పదేపదే ప్రశ్నించింది. దాంతో ఇలాంటి సందర్భంలో ఆ ఆఫర్‌ను ఎలా తిరస్కరించగలం..? అని ఎదురు ప్రశ్నించారు. అంటే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో NDA తరఫున బరిలో దిగుతామని చెప్పకనే చెప్పారు. దాంతో జయంత్ ‘INDIA’ కూటమిని వీడనున్నారనే విషయం స్పష్టమైంది.