చెన్నై: తమిళనాడు మాజీ సీఎం జయలలిత ఇంటిని రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవద్దని మద్రాసు హైకోర్టు తెలిపింది. జయలలిత ఆకస్మిక మరణాంతరం ఆమె నివాసమైన వేద నిలయాన్ని స్మారక చిహ్నంగా మార్చాలని గతంలో అధికారంలో ఉన్న ఏఐఏడీఎంకే ప్రభుత్వం ప్రతిపాదించింది. ఆ ఇంటిని స్మారక చిహ్నంగా మార్చే బాధ్యత, హక్కు పార్టీకి ఉన్నదని తెలిపింది. ఇది తమిళనాడు ప్రజలు, ఏఐఏడీఎంకే పార్టీ కార్యకర్తల ‘పూర్తి హృదయపూర్వక కోరిక’ అని అన్నాడీఎంకే పేర్కొంది.
జయలలిత మరణించిన కొన్ని నెలల తర్వాత 2017లో ఏఐఏడీఎంకేలోని రెండు వర్గాల విలీనానికి ముందస్తు షరతుల్లో ఇది కూడా ఒకటి. నాడు ముఖ్యమంత్రిగా ఉన్న ఇ పళనిస్వామి ఈ ప్రకటన చేశారు. 0.55 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆస్తిని స్వాధీనం చేసుకోవడానికి గత ఏడాది జూలైలో రాష్ట్ర ప్రభుత్వం రూ.67.9 కోట్లను సిటీ కోర్టులో డిపాజిట్ చేసింది.
మరోవైపు జయలలిత చట్టపరమైన వారసులుగా కోర్టు ప్రకటించిన జయలలిత మేనకోడలు దీప, మేనల్లుడు దీపక్ దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశారు. జయ నివాసాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం ‘దోపిడీ’గా ఆరోపించింది. చెన్నై పోయెస్ గార్డెన్ నివాసాన్ని రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడాన్ని హైకోర్టులో సవాల్ చేశారు. ఈ నేపథ్యంలో జయ నివాసాన్ని రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడాన్ని మద్రాసు హైకోర్టు బుధవారం రద్దు చేసింది.
.