ముంబై: మహారాష్ట్రలోని రాయిగడ్ జిల్లాలో దారుణం జరిగింది. స్కూల్లో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ఓ విద్యార్థి తలలోకి జావెలిన్(Javelin) దూసుకువెళ్లింది. ఈ ఘటనలో 15 ఏళ్ల విద్యార్థి హుజేఫా దవారే మృతిచెందాడు. మన్‌గావ్ తాలూకాలో ఉన్న ఐఎన్టీ ఇంగ్లీష్ స్కూల్లో ఈ ఘటన జరిగింది. స్కూల్ విద్యార్థులు జావెలిన్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు ఒక విద్యార్థి బలయ్యారు. జావెలిన్ త్రో కోసం గ్రౌండ్లో ఉన్న హుజేఫా .. కిందకు వంగి తన షూ లేస్ కట్టుకుంటున్న సమయంలో.. మరో విద్యార్థి ప్రాక్టీస్‌లో భాగంగా జావెలిన్‌ను విసిరాడు. అయితే ఆ జావెలిన్ నేరుగా వచ్చి షూ లేస్ కట్టుకుంటున్న విద్యార్థి తలలోకి దిగింది. జావెలిన్ తలలోకి దిగగానే.. ఆ విద్యార్థి అక్కడే కూలిపోయాడు. బ్లీడింగ్ అవుతున్న అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్లినా ప్రయోజనం జరగలేదు. గోరేవాగ్ పోలీసులు కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.