చండీగఢ్: అసెంబ్లీ ఎన్నికలకు కేవలం కొన్ని రోజుల ముందు పంజాబ్ కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పోలింగ్‌కు కేవలం 20 రోజుల సమయం మాత్రమే మిగిలివున్న వేళ మాజీ ఎమ్మెల్యే, ఆ పార్టీ కీలక నేత జస్బీర్ సింగ్ ఖంగుర రాజీనామా చేశారు. ఈ మేరకు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి ఆయన తన రాజీనామా లేఖను పంపారు.
పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు జస్బీర్ సింగ్ ఖంగుర తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. పార్టీ కోసం తన తండ్రి 60 ఏండ్లు, తాను 20 ఏండ్లు సేవ చేశామని గుర్తుచేశారు. పార్టీ ద్వారా ఇన్నేండ్లు ప్రజలకు సేవ చేసుకునే అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అయితే, తన రాజీనామాకు గల కారణాన్ని మాత్రం వెల్లడించలేదు.
జస్బీర్ సింగ్ ఖంగుర గతంలో ఖిలా రాయ్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే, ఈసారి కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ టికెట్ నిరాకరించడంతో ఆయన పార్టీకి రాజీనామా చేశారు. కాగా, మొత్తం 117 స్థానాలున్న పంజాబ్‌లో ఈ నెల 20న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనుంది.