Jarkhand elections : అది జార్ఖండ్ (Jarkhand) రాష్ట్రం పశ్చిమ సింగ్భుమ్ (West Singhbhum) జిల్లా జగన్నాథ్‌పూర్ (Jagannathpur) అసెంబ్లీ నియోజకవర్గంలోని సొనాపీ (Sonapi) గ్రామం. జార్ఖండ్ అసెంబ్లీ (Jarkhand Assembly) తొలి విడత ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఇవాళ ఆ గ్రామంలో పోలింగ్ జరుగుతున్నది. ఈ క్రమంలో గ్రామ ప్రజలు ఎన్నికలను బహిష్కరించాలని ముందుగానే నక్సలైట్లు (Naxalites) హెచ్చరించారు. అంతేగాక మంగళవారం రాత్రి గ్రామంలోని పలు ప్రాంతాల్లో ఓటు వేయవద్దనే హెచ్చరికలతో కూడిన పోస్టర్లు వేశారు.
అయినా సొనాపీ గ్రామ ప్రజలు భయపడలేదు. నక్సలైట్ల హెచ్చరికలను ఖాతరు చేయలేదు. మరోవైపు ఎన్నికల సంఘం కూడా భారీగా భద్రతా బలగాలను మోహరించడంతో ఓటర్లు ధైర్యంగా పోలింగ్ బూత్‌లకు వెళ్లి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. దాంతో ఆ గ్రామంలోని అన్ని పోలింగ్ బూత్‌లలో భారీగా పోలింగ్ నమోదవుతోంది. ప్రాథమిక పాఠశాలలోని 25వ నంబర్ పోలింగ్ బూత్‌లో అయితే ఉదయం 11 గంటలకే 60 శాతం పోలింగ్ పూర్తయ్యింది.
జార్ఖండ్‌లోని మొత్తం 81 అసెంబ్లీ స్థానాలకు రెండు విడతల్లో పోలింగ్ నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఇవాళ తొలి విడత పోలింగ్ జరుగుతోంది. ఈ నెల 20న రెండో విడత పోలింగ్ నిర్వహించనున్నారు. 23న ఓట్లను లెక్కించి ఫలితాలను వెల్లడించనున్నారు.