Hemanth Soren : తాను ప్రజలకు జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడుతానని జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ (Hemant Soren) పేర్కొన్నారు. శుక్రవారం తన పుట్టినరోజును పురస్కరించుకొని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. తాను జైలు నుంచి విడుదలయ్యే సమయంలో ఆయన చేతిపై వేసిన ఖైదీ గుర్తు ఫొటోను ఎక్స్‌లో పంచుకున్నారు. ఆ గుర్తును ప్రస్తుతం ప్రజాస్వామ్యం ఎదుర్కొంటున్న సవాళ్లకు చిహ్నంగా అభివర్ణించారు.
‘ఈ రోజు నా పుట్టిన రోజు. ఇటీవల జైలు నుంచి విడుదలైనప్పుడు నా చేతిపై వేసిన ఈ గుర్తు నాది మాత్రమే కాదు. దేశ ప్రజలందరిది. ప్రస్తుతం మన ప్రజాస్వామ్యం ఎదుర్కొంటున్న సవాళ్లకు ఇది చిహ్నం. ఎలాంటి ఫిర్యాదులు, సాక్ష్యాధారాలు లేకుండా ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని 150 రోజులు జైల్లో ఉంచారు. ఇక సామాన్య గిరిజనులు, దళితులు, అణగారిన వర్గాల ప్రజల విషయంలో ఏవిధంగా వ్యవహరిస్తారో అర్థం చేసుకోవచ్చు’ అని సోరెన్ పేర్కొన్నారు.
ఈ రోజు నుంచి అన్నివర్గాల ప్రజల హక్కుల కోసం పోరాడాలని ధ్రుఢంగా సంకల్పించుకున్నట్లు ఆయన తెలిపారు. కులం, మతం, రంగు, వస్త్రధారణ వల్ల సమస్యలు ఎదుర్కొంటున్న ప్రజల తరపున పోరాడతానని చెప్పారు. అందరికీ సమన్యాయం, హక్కులు ఉండే సమాజాన్ని నిర్మించుకుందామని పిలుపునిచ్చారు. భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో హేమంత్ సోరెన్‌ను ఈ ఏడాది జనవరి 31న ఈడీ అధికారులు అరెస్టు చేశారు. జూన్ 28న జైలు నుంచి విడుదలయ్యారు. జూలై 4న ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు.