JJP alliance : అసెంబ్లీ ఎన్నికల (Assembly elections) వేళ హర్యానా (Haryana) లో కొత్త పొత్తు పొడిచింది. హర్యానా మాజీ ఉప ముఖ్యమంత్రి దుష్యంత్ చౌతలా (Dushyant Chautala) నేతృత్వంలోని జననాయక్ జనతా పార్టీ (JJP).. చంద్రశేఖర్ ఆజాద్ (Chandrashekhar Azad) నేతృత్వంలోని ఆజాద్ సమాజ్ పార్టీ – కాన్షీరామ్ (Azad Samaj Party – Kanshi Ram) పొత్తుపెట్టుకున్నాయి.
ఈ పొత్తు విషయాన్ని దుష్యంత్ చౌతలా వెల్లడించారు. మాయావతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్వాది పార్టీ (BSP) కంటే చంద్రశేఖర్ ఆజాద్ నేతృత్వంలోని ఆజాద్ సమాజ్ పార్టీతో పొత్తే రాజకీయంగా మేలని తాను భావించానని, అందుకే ఆ పార్టీతో పొత్తుపెట్టుకున్నానని చెప్పారు. పొత్తులో భాగంగా హర్యానాలోని మొత్తం 90 అసెంబ్లీ సీట్లకుగాను జేజేపీ 70 చోట్ల, ఆజాద్ సమాజ్ పార్టీ 20 చోట్ల పోటీ చేయనున్నాయని తెలిపారు.
కాగా, హర్యానాలో అక్టోబర్ 1న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. అదే నెల 4న ఓట్లను లెక్కించనున్నారు. ఈ మేరకు ఇటీవలే కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఎన్నికల షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల కోలాహలం నెలకొన్నది. పార్టీలు పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి.