పాట్నా : బీహార్ శాసన సభ ఎన్నికల్లో ప్రపంచ బ్యాంకు నిధులను ఖర్చు చేసి, ఓటర్లను ప్రభావితం చేశారని ప్రశాంత్ కిశోర్ నేతృత్వంలోని జన్ సురాజ్ పార్టీ ఆరోపించింది. అభివృద్ధి పనుల కోసం కేటాయించిన రూ.14,000 కోట్లను దారి మళ్లించారని తెలిపింది. ఎన్నికలకు ముందు మహిళలకు నగదు బదిలీ చేసి, తద్వారా ఎన్నికలను ప్రభావితం చేశారని పేర్కొంది. ఇది స్పష్టంగా ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేయడమేనని, ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేయడానికి చేసిన అనైతిక ప్రయత్నమని పేర్కొంది. దీనిపై దర్యాప్తు జరపాలని డిమాండ్ చేసింది. నితీశ్ కుమార్ నేతృత్వంలోని బీహార్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు 1.25 కోట్ల మంది మహిళల బ్యాంకు ఖాతాలకు రూ.10,000 చొప్పున బదిలీ చేసిన సంగతి తెలిసిందే.
ఎన్డీఏ విజయం సాధించడం వెనుక ఈ పథకం పాత్ర ఉందని విశ్లేషకులు చెప్తున్నారు. జన్ సురాజ్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఉదయ్ సింగ్ మాట్లాడుతూ, ఈ ఎన్నికల ఫలితాలు కొనుక్కున్నవేనని చెప్పారు. ప్రజా తీర్పు కోసం జూన్ 21 నుంచి పోలింగ్ తేదీ వరకు దాదాపు రూ.40,000 కోట్లు ఖర్చు చేశారన్నారు. ప్రజా ధనాన్ని ఉపయోగించి, ప్రజల ఓట్లను కొన్నారని ఆరోపించారు. ప్రపంచ బ్యాంకు నుంచి వచ్చిన నిధులను ఈ నగదు బదిలీకి వాడినట్లు తెలిసిందన్నారు.