మంగళవారం 11 ఆగస్టు 2020
National - Jul 08, 2020 , 18:36:29

కశ్మీర్ లో ఐపీఎస్ అధికారి సస్పెండ్

కశ్మీర్ లో ఐపీఎస్ అధికారి సస్పెండ్

కశ్మీర్ : జమ్ముకశ్మీర్ ఐపీఎస్ అధికారి బసంత్ రాత్‌ను కేంద్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ మేరకు కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఐపీఎస్ అధికారి రాత్ దుష్ప్రవర్తనకు పాల్పడినట్లు రుజువు కావడంతో సస్పెండ్ చేసినట్లు కేంద్ర హోంశాఖ తెలిపింది. మంగళవారం సాయంత్రం జారీ చేసిన ఈ ఉత్తర్వులో 2000 బ్యాచ్ ఐపీఎస్ అధికారి వెంటనే శ్రీనగర్ లోని పోలీసు ప్రధాన కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. అనుమతి లేకుండా జమ్ముకశ్మీర్ విడిచి వెళ్లకూడదని కూడా ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నది. అయితే, బసంత్‌ రాత్‌పై వచ్చిన అభియోగాలను మాత్రం ఈ ఉత్తర్వులో పేర్కొనకపోవడం విశేషం.

జమ్ముకశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతలో సివిల్ డిఫెన్స్ విభాగం ఇన్స్పెక్టర్ జనరల్ (ఐజీ) గా నియమితులైన బసంత్ రాత్.. 2000 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. రాత్ ఇటీవల ఒక లేఖ జమ్ముకశ్మీర్ పోలీసు విభాగంలో కలకలం రేపింది, జమ్ముకశ్మీర్ పోలీస్ చీఫ్ యొక్క "కొన్ని కార్యకలాపాల" కారణంగా తన వ్యక్తిగత భద్రత గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నాను అని లేఖల పేర్కొన్నారు. ఈ లేఖ కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వివాదానికి దారితీసింది.

జమ్ముకశ్మీర్ పోలీస్ చీఫ్ దిల్‌బాగ్ సింగ్‌తో రాత్‌కు గత కొన్ని రోజలుగా విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ వివాదాలు కాస్తా గత నెలలో డీజీపీపై పోలీసులకు ఫిర్యాదు చేయటానికి  దారితీసింది.


logo