శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తయ్యింది. 2019లో ఏర్పడిన జమ్ముకశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతంలోని అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ దీనిని పూర్తి చేసింది. సంబంధిత తుది నివేదికపై కమిటీ సభ్యులు గురువారం సంతకం చేశారు. ఈ నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందజేస్తారు. అనంతరం దీనిని ప్రజల ముందుకు తెచ్చి అభ్యంతరాలు, సూచనలు, సలహాలు కోరుతారు. ఆయా మార్పుల అనంతరం గెజిట్ నోటిఫికేషన్ వెలువడుతుంది. దీంతో అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన ఆధారంగా జమ్ముకశ్మీర్లో ఎన్నికలు నిర్వహించేందుకు వీలు ఏర్పడుతుంది. రాష్ట్ర హోదాను తర్వలోనే పునరుద్ధరించి ఎన్నికలు నిర్వహిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల హామీ ఇచ్చారు.
కాగా, 2018 జూన్ నుంచి జమ్ముకశ్మీర్లో ఎన్నికైన ప్రభుత్వం అధికారంలో లేదు. 2019 ఆగస్ట్ 5న ఆ రాష్ట్రాన్ని జమ్ముకశ్మీర్, లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాలుగా కేంద్ర ప్రభుత్వం విభజించింది. అలాగే అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన కోసం 2020లో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి రంజన ప్రకాష్ దేశాయ్ నేతృత్వంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్ర, డిప్యూటీ ఎన్నికల కమిషనర్ చందర్ భూషణ్ కుమార్, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కేకే శర్మ, ప్రధాన ఎన్నికల అధికారి హృదేశ్ కుమార్ ఎక్స్-అఫీషియో సభ్యులుగా ఒక కమిటీని నియమించింది. ఈ కమిటీకి గడువును ఇప్పటికే ఏడాదిపాటు కేంద్రం పొడిగించింది. ఈ ఏడాది మార్చి 6తో గడువు ముగియనుండగా ఈ ఏడాది ఫిబ్రవరిలో మరో రెండు నెలలు పొడిగించింది.
మరోవైపు జమ్ముకశ్మీర్లో డీలిమిటేషన్ ప్రక్రియను ఎట్టకేలకు ఈ కమిటీ పూర్తి చేసింది. తుది నివేదికపై కమిటీ సభ్యులు గురువారం సంతకాలు చేశారు. ప్రస్తుతం కశ్మీర్ డివిజన్లో 46, జమ్ము డివిజన్లో 37 కలిపి మొత్తం 83 స్థానాలున్నాయి. అయితే మొత్తం సీట్ల సంఖ్యను 83 నుంచి 90కి పెంచాలని కమిటీ ప్రతిపాదించింది. జమ్ము డివిజన్లో ఆరు, కశ్మీర్ డివిజన్లో ఒక అదనపు స్థానాన్ని సూచించింది. తొలిసారిగా షెడ్యూల్డ్ తెగల (ఎస్టీలు) కోసం తొమ్మిది సీట్లు కేటాయించింది. అలాగే పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)కు సంబంధించి 24 సీట్లు ఖాళీగా ఉండనున్నాయి.