Omar Abdullah | అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) పాకిస్తాన్‌కు బిలియన్ డాలర్ల రుణం ఇవ్వడంపై జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఆందోళన వ్యక్తం చేశారు. రుణం ఇవ్వడం వల్ల భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గబోవన్నారు. పూంచ్, రాజౌరి, ఉరి, తంగ్ధర్ తదితర ప్రాంతాల్లో దాడి చేసేందుకు వినియోగిస్తున్న మందుగుండు సామగ్రి ఖర్చులను ఐఎంఎఫ్ చెల్లిస్తున్నప్పుడు.. ఉపఖండంలో ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితులు ఎలా తగ్గంచవచ్చని అంతర్జాతీయ సమాజం భావిస్తుందో తనకు తెలియడం లేదన్నారు. సరిహద్దుల్లో పాక్ చేస్తున్న దాడులకు ఐఎంఎఫ్ నిధులు ఎలా ఉపయోగపడుతున్నాయో పేర్కొన్నారు. ఐఎంఎఫ్ మంజూరు చేసిన రుణం కారణంగా పాక్ సైనిక చర్యలకు ఊతమిస్తుందని.. దాంతో జమ్మూ కశ్మీర్లో శాంతికి విఘాతం కలిగిస్తుందన్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి.
ఇదిలా ఉండగా.. పాకిస్తాన్‌కు బిలియన్ డాలర్ల రుణాన్ని విడుదల చేయడానికి అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) శుక్రవారం ఆమోదం తెలిపింది. ఐఎంఎఫ్ బోర్డు సమావేశం శుక్రవారం వాషింగ్టన్లో జరిగింది. పాక్‌కు ఉద్దీపన ప్యాకేజీపై జరిగిన ఓటింగ్‌కు భారత్ దూరంగా ఉంది. గతంలో ఇచ్చిన ఆర్థిక సహాయాన్ని సమర్థంగా ఉపయోగించుకోవడంలో ఐఎంఎఫ్ షరతులను పాటించడంలో పాక్ పదేపదే విఫలమవుతున్నదని తెలిపింది. పాకిస్థాన్‌తో ఉద్రిక్తతలు తీవ్రరూపం దాలుస్తున్న తరుణంలో భారత్ ఈ నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్‌కు అందచేస్తున్న రుణాలు సైనిక నిఘా కార్యకలాపాలకు, భారత భూభాగంపై దాడులు నిర్వహించిన లష్కరే తాయిబా, జైషే మహమ్మద్ వంటి ఉగ్ర గ్రూపులకు పరోక్షంగా సాయపడుతున్నాయని భారత్ మొదటినుంచి వాదిస్తూ వస్తోంది. సీమాంతర ఉగ్రవాదాన్ని అంతం చేయడానికి పటిష్టమైన చర్యలు తీసుకోనంత వరకు పాక్‌కు ఆర్థిక సహకారం అందచేయవద్దని ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకు వంటి అంతర్జాతీయ ఆర్థిక సంస్థలకు విజ్ఞప్తి చేస్తూ వస్తున్నది.