Jammu Kashmir | శ్రీనగర్, ఆగస్టు 16: జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు ఎట్టకేలకు నగారా మోగింది. ఆరేండ్ల పాటు ముఖ్యమంత్రి లేకుండా కొనసాగిన ఈ కేంద్రపాలిత ప్రాంతంలో ఇక ప్రభుత్వం కొలువుదీరనుంది. 90 స్థానాల ఈ అసెంబ్లీలో పాగా వేసేందుకు జాతీయ, ప్రాంతీయ పార్టీలు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. మొదటిసారి జమ్ము కశ్మీర్లో సొంతంగా అధికారం చేపట్టాలని బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నది. మరోవైపు 2014లో అధికారం కోల్పోయిన జమ్ము కశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ ఈసారి మళ్లీ అధికారంలోకి రావాలని పట్టుదలగా ఉంది. గత ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా నిలిచి నాలుగేండ్లు అధికారంలో ఉన్న మెహబూబా ముఫ్తీ నేతృత్వంలోని జమ్ము కశ్మీర్ పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ(పీడీపీ) సైతం పట్టు నిలుపుకోవాలని ప్రయత్నిస్తున్నది.
జమ్ము ప్రాంతంపైనే బీజేపీ ఆశలు పెట్టుకుంది. ఇక్కడ 43 సీట్లు ఉన్నాయి. హిందువుల జనాభా ఎక్కువగా ఉండే జమ్ము ప్రాంతంలో నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ ప్రభావం తగ్గింది. గత అసెంబ్లీ ఎన్నికలు, ఇటీవలి లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో ఇదే రుజువైంది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిచిన 25 స్థానాలూ జమ్ము ప్రాంతంలోనివే. తాజా లోక్‌సభ ఎన్నికల్లో జమ్ములోని రెండు స్థానాలనూ బీజేపీ గెలుచుకుంది. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా జమ్ములో ఆరు స్థానాలు పెరగడం బీజేపీకి కలిసొస్తుందనే అంచనాలు ఉన్నాయి. మొత్తం 50 స్థానాలపై బీజేపీ దృష్టి సారించింది. వీటిల్లోనే మేజిక్ ఫిగర్‌ను చేరుకునేన్ని సీట్లు గెలుస్తుందా అనేది చూడాల్సి ఉంది.
కశ్మీర్ ప్రాంతంలో 47 నియోజకవర్గాలు ఉన్నాయి. ముస్లింల జనాభా ఎక్కువగా ఉండే కశ్మీర్లో బీజేపీ ప్రభావం నామమాత్రంగానే ఉంది. ఇక్కడ నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ మధ్యనే ప్రధాన పోటీ ఉంది. లోక్‌సభ ఎన్నికల్లో కశ్మీర్ ప్రాంతంలోని మూడు స్థానాల్లో రెండింటిలో నేషనల్ కాన్ఫరెన్స్, ఒకదాంట్లో స్వతంత్ర అభ్యర్థి గెలిచారు. అయితే, లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ మధ్య పొత్తు ఉంది. ఇప్పుడు ఒంటరిగా వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు కూడా కశ్మీర్ ప్రాంతంపై నేషనల్ కాన్ఫరెన్స్ గంపెడాశలు పెట్టుకుంది.