న్యూఢిల్లీ: జమిలి ఎన్నికలపై తీసుకువచ్చిన రెండు బిల్లులపై ఏర్పాటు చేసిన పార్లమెంటరీ ప్యానెల్ మొదటి సమావేశం అధికార, విపక్ష నేతల వాదోపవాదాలతో దద్దరిల్లింది. జమిలి ఎన్నికల బిల్లు రాజ్యాంగం, సమాఖ్యవాద ప్రాథమిక నిర్మాణంపై దాడిగా విపక్ష ఎంపీలు వర్ణించగా, ఇది ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించేదిగా ఉందని బీజేపీ ఎంపీలు సమర్థించారు. 39 మందితో ఏర్పాటు చేసిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ తొలి సమావేశంలో బిల్లు ఉద్దేశాలు, లక్ష్యాలు, అందులో పొందుపరిచిన అంశాలను న్యాయ శాఖ తొలుత వివరించింది. ఈ సందర్భంగా పలువురు విపక్ష ఎంపీలు జమిలి ఎన్నికల కారణంగా ఖర్చు తగ్గుతుందన్న కేంద్రం వాదనను నిలదీశారు. అసలు ఒకే ఎన్నిక విధానం అన్న మాటే రాజ్యాంగ విరుద్ధమని, సమాఖ్యవాద ప్రాథమిక నిర్మాణంపై దాడి అని కాంగ్రెస్, డీఎంకే, టీఎంసీ ఎంపీలు విమర్శించారు.