(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): భారత రాజకీయ ముఖ చిత్రాన్ని సమూలంగా మార్చేసే కీలకమైన ‘జమిలి ఎన్నికల’ విధానంపై మరోమారు చర్చ మొదలైంది. 2029 లోక్‌సభ ఎన్నికలతో పాటే తమ సర్కారు అధికారంలో ఉన్న 22 రాష్ర్టాలు, యూటీల శాసన సభ ఎన్నికలను కలిపి నిర్వహించడానికి కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తున్నది. ఈ మేరకు సాధ్యాసాధ్యాలపై అధికార కూటమి నేతలు విస్తృతంగా సమాలోచనలు చేస్తున్నట్టు జాతీయ వార్త పత్రిక ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ ఓ కథనంలో వెల్లడించింది.
కేంద్రం ఆలోచన ఇది..
ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం ప్రకారం.. జమిలి ఎన్నికల నిర్వహణను విపక్ష పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ క్రమంలో ఏక కాల ఎన్నికలను వీలైనంత త్వరగా నిర్వహించడానికి ఎన్డీయే ప్రభుత్వం కొత్త ఆలోచన చేసింది. దేశంలోని 17 రాష్ర్టాల్లో బీజేపీ సొంతంగా అధికారంలో ఉన్నది. మరో ఐదు రాష్ర్టాల్లో బీజేపీ మిత్ర పక్షాలు అధికారంలో ఉన్నాయి. అలా మొత్తంగా 22 రాష్ర్టాల్లో ఎన్డీయే ప్రభుత్వాలే ఉన్నాయి. 2029 లోక్‌సభ ఎన్నికలు జరుగడానికి ముందే ఎన్డీయే పాలిత 11 రాష్ర్టాల శాసనసభలకు ఎన్నికలు జరుగనున్నాయి. 2029 లోక్‌సభ ఎన్నికలతో పాటే మరో నాలుగు ఎన్డీయే రాష్ర్టాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. మిగతా ఏడు ఎన్డీయేపాలిత రాష్ర్టాల ఎన్నికలు 2030-31 మధ్య జరుగనున్నాయి. దీంతో జమిలి ఎన్నికల కోసం తమ రాష్ర్టాల్లోని ప్రభుత్వాల పాలనను వెనక్కి కానీ ముందుకు కానీ జరుపుకునేందుకు పెద్దగా అభ్యంతరాలు ఉండకపోవచ్చని ఎన్డీయే సర్కారు భావిస్తున్నది.
అందుకే తమ రాష్ర్టాల్లో ముందుగా..
2029లో ఆంధ్రప్రదేశ్, అరుణాచల్‌ప్రదేశ్, ఒడిశా, సిక్కిం, హర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో ‘జమిలి’ ప్రక్రియకు పెద్దగా ఇబ్బందులు ఎదురు కావడం లేదు. అయితే 2028లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, త్రిపుర, తెలంగాణ, మేఘాలయ, నాగాలాండ్, మిజోరం అసెంబ్లీల గడువు ముగుస్తున్నది. జమిలి ఎన్నికల కోసం ఆయా అసెంబ్లీల కాలాన్ని 5 నెలల నుంచి ఏడాది వరకు పొడిగించాల్సి ఉంటుంది.
ఇక బీహార్, ఢిల్లీ, తమిళనాడు, కేరళ, పశ్చిమబెంగాల్, అస్సాం, పుదుచ్చేరి అసెంబ్లీల గడువు 2030-31లో ముగియనున్నది. వాటి గడువును ఒకటి నుంచి రెండేండ్లు తగ్గించాల్సి వస్తుంది. అయితే, ఇంతటి భారీ సంస్కరణకు పార్లమెంట్ శాసనపరమైన మార్పులు చేయడంతో పాటు విస్తృత రాజకీయ ఏకాభిప్రాయం అవసరమవుతుంది. ఈ ప్రతిపాదనను జార్ఖండ్, కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు, కేరళ తదితర రాష్ర్టాల్లో అధికారంలో ఉన్న విపక్ష ప్రభుత్వాలు పెద్దయెత్తున వ్యతిరేకించే అవకాశం ఉన్నది. ఈ క్రమంలోనే తొలుత తాము అధికారంలో ఉన్న 22 రాష్ర్టాల్లో జమిలి ప్రక్రియను కొనసాగించడానికి ఎన్డీయే ప్రభుత్వం కార్యచరణ సిద్ధం చేసినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి.
సాధ్యమే అంటూ సంకేతాలు
22 ఎన్డీయే పాలిత రాష్ర్టాల శాసనసభ ఎన్నికలను లోక్‌సభ ఎన్నికలతో నిర్వహించే విషయమై ఇండియన్ ఎక్స్‌ప్రెస్.. జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) చైర్మన్ పీపీ చౌదరిని సంప్రదించింది. దీనికి ఆయన స్పందిస్తూ.. ‘దీనిపై ఎన్డీయే పాలిత ముఖ్యమంత్రులే నిర్ణయం తీసుకోవాలి. ఈ అంశం కమిటీ పరిధిలోకి రాదు’ అని పేర్కొన్నారు. కాగా 2029 నాటికి జమిలి ఎన్నికలు సాధ్యమే అంటూ ఇటీవల సంకేతాలు ఇచ్చిన పీపీ చౌదరి..
రాబోయే సార్వత్రిక ఎన్నికల నాటికి వన్ నేషన్ వన్ ఎలక్షన్ కసరత్తుని పూర్తి చేసేందుకు తమ కమిటీ కృషి చేస్తున్నదని పేర్కొన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా జమిలి ఎన్నికల బిల్లుకు సంబంధించిన ఆంశంలో గత నెలలో పార్లమెంట్ కీలక నిర్ణయం తీసుకొన్నది. జమిలి ఎన్నికలకు సంబంధించిన 129వ రాజ్యాంగ సవరణ బిల్లులను పరిశీలిస్తున్న జేపీసీ కాల పరిమితిని వచ్చే శీతాకాల సమావేశాల చివరి వారం వరకూ పొడిగిస్తూ ఆమోదం తెలిపింది. దీంతో జమిలిపై వచ్చే శీతాకాల సమావేశాల్లో ఏదైనా ప్రకటన వెలువడవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు 2029 లోక్‌సభ ఎన్నికలతో పాటు 22 ఎన్డీయే రాష్ర్టాల శాసనసభ ఎన్నికల వార్తలను కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేశ్ ఊహాగానాలుగా కొట్టిపారేశారు.
1967 తర్వాత దెబ్బతిన్న ఎన్నికల చక్రం
దేశంలో 1952 నుంచి 1967 మధ్య మొదటి నాలుగు సాధారణ ఎన్నికల చక్రాలలో లోక్‌సభ, చాలా రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలను నిర్వహించారు. అయితే 1967 తర్వాత పలు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కూలిపోవడంతో ఈ ఉమ్మడి ఎన్నికల చక్రం దెబ్బతిన్నది. 1971లో జరిగిన ముందస్తు లోక్‌సభ ఎన్నికలు తదితర పరిణామాలు ఈ చక్రాన్ని మరింతగా దెబ్బతీశాయి.
కుల గణన ప్రణాళికాబద్ధ వైఫల్యం
న్యూఢిల్లీ: ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతున్న జనాభా లెక్కల్లో కుల గణన చేయడంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మోదీ ప్రభుత్వం భారతదేశ తదుపరి జనాభా లెక్కల్లో కులాన్ని పరిగణిస్తామని ఏప్రిల్ 2025లో ప్రకటించింది. ఆ సమయంలో 2011 నాటి జనాభా లెక్కల్లో కులాన్ని చేర్చకపోవడం నాటి మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వ తప్పిదమంటూ విమర్శలు గుప్పించింది. ఆనాడే మెజారిటీ రాజకీయ పార్టీలు కులగణన నిర్వహించాలని సిఫార్సు చేశాయని క్యాబినెట్లో విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. అయితే ఇది చెప్పిన ఏడాది తర్వాత మోదీ ప్రభుత్వం నాటి మన్మోహన్సింగ్ పరిపాలనా కాలంలో ఉపయోగించిన పద్ధ్దతినే కుల గణనకు అనుసరిస్తామని తెలిపింది. అయితే 2011లో సేకరించిన డేటా లోపభూయిష్టంగా ఉండటం వల్ల ఎన్నడూ విడుదల చేయలేదనే విషయాన్ని పరిగణలోకి తీసుకుంటే, ఇప్పుడు జరుగుతున్న కుల గణనపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
కుల గణన విధానంపై విశ్లేషకులు, కార్యకర్తలు, రాజకీయ నేతలతో ‘స్క్రోల్’ సంస్థ మాట్లాడినప్పుడు పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. వారిలో అధికశాతం మంది కులాలను లెక్కించేందుకు ఎన్నుకున్న పద్దతి లోపభూయిష్టమని అన్నారు. ఇటీవల బీహార్, తెలంగాణ తదితర రాష్ర్టాలు కులగణన నిర్వహించినప్పుడు 2011 మోడల్‌కు కట్టుబడి ఉండాలనే మోదీ ప్రభుత్వ నిర్ణయాన్ని వారు ప్రశ్నించారు. జనాభా లెక్కల్లో సేకరించే కుల డేటా నిరుపయోగంగా మారుతుందని కొందరు విమర్శకులు వాదించారు. 2021 సెప్టెంబర్ 21న మోదీ ప్రభుత్వం కుల గణన పిటిషన్‌ను తిరస్కరిస్తూ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది.
అయితే ఆ అఫిడవిట్‌లోని 12(డి) పేరాలో ‘2011 జనాభా లెక్కల నిర్వహణకు ముందు కులాల రిజిస్ట్రీ ఏదీ సిద్ధం చేయలేదు’ అని ఉంది. కాగా కులగణన కోసం ఎన్యూమరేటర్లు మొదట ప్రజలను షెడ్యూల్ కులాలు(ఎస్సీ) లేదా షెడ్యూల్ తెగలకు(ఎస్టీ) చెందినవారా కాదా అని అడుగుతారు. ఈ సమయంలో ప్రజలు తమ కులాన్ని ప్రకటించడానికి ఇష్టపడటం లేదని చెప్పే అవకాశం కూడా ఉందని ‘ది హిందూ’ పేర్కొంది. కాగా కులంపై పరిమితులు లేని ప్రశ్నలు ఉండటం వలన వైవిధ్యంతో కూడిన సమాధానాలు వస్తాయని ఇది అర్థవంతమైన విశ్లేషణను అందించదని విమర్శకులు వాదిస్తున్నారు. 2001 నుంచి జనాభా లెక్కల్లో కులం లెక్కింపుపై వాదన చేస్తున్న సామాజిక శాస్త్రవేత్త సతీశ్ దేశ్ పాండే దీనిని ప్రణాళికాబద్ధమైన వైఫల్యం అని పేర్కొన్నారు. కులం గురించి పలు ప్రశ్నలు అడగడం వల్ల ఒకే సమాజానికి చెందిన వారు వేర్వేరు కులాల పేర్లతో తమను తాము గుర్తించుకునే అవకాశం ఉంది.