Jain Monk Sacrifice | జార్ఖండ్ ప్రభుత్వం నిర్ణయానికి వ్యతిరేకంగా ఆమరణదీక్షకు దిగిన జైన సన్యాసి ప్రాణాలు కోల్పోయాడు. జార్ఖండ్‌లోని ప్రముఖ జైన మందిరం సమ్మేద్ శిఖరాన్ని పర్యాటక కేంద్రంగా మారుస్తూ అక్కడి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రెండు రోజుల క్రితం దేశ రాజధాని ఢిల్లీతో పాటు ముంబై, అహ్మదాబాద్‌లో జైన్ కమ్యూనిటీ ప్రజలు ఆందోళనలు చేపట్టారు. పలు సంఘాలు కూడా వీరి ఆందోళనకు మద్దతుగా నిలిచాయి.
జార్ఖండ్‌లోని జైన మందిరం సమ్మేద్ శిఖర్ను పర్యాటక ప్రదేశంగా మార్చడాన్ని నిరసిస్తూ ఆమరణదీక్షలో ఉన్న జైన సన్యాసి సుగ్యేసాగర్ మహారాజ్ మంగళవారం తన ప్రాణాలు కోల్పోయారు. జార్ఖండ్ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఆయన గత 10 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారు. ఆయన వయసు 72 ఏండ్లు. డిసెంబర్ 25 నుంచి సంగనేరులో సుగ్యేసాగర్ మహారాజ్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. మంగళవారం ఉదయం సంగనేర్ సంఘీజీ దేవాలయం నుంచి ఆయన దోల్ యాత్ర చేపట్టారు. ఈ దోల్ యాత్రలో ఆచార్య సునీల్ సాగర్ సహా పెద్ద సంఖ్యలో జైన సంఘం ప్రజలు పాల్గొన్నారు. జైన సన్యాసికి జైపూర్‌లోని సంగనేర్‌లో సమాధి కట్లనున్నారు.
జార్ఖండ్ ప్రభుత్వం గిరిదిహ్ జిల్లాలో ఉన్న పరస్నాథ్ కొండను పర్యాటక ప్రదేశంగా ప్రకటించింది. దీనిపై దేశవ్యాప్తంగా జైన మతస్థులు ఆందోళనలు చేస్తున్నారు. పరస్నాథ్ కొండ సమ్మేద్ శిఖర్ అని కూడా ప్రసిద్ధి. ఈ ఆలయానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న జైనులు వస్తుంటారు. ఇదే అత్యంత ఎత్తుపై ఉన్న తీర్థయాత్ర స్థలం. ఇలాంటి పుణ్యక్షేత్రాన్ని పర్యాటక కేంద్రంగా మార్చడాన్ని ఆల్ ఇండియా జైన్ బ్యాంకర్స్ ఫోరం అధ్యక్షుడు భాగచంద్ర జైన్ తీవ్రంగా ఖండించారు. జైన సన్యాసి మరణం పట్ల విచారం వ్యక్తం చేశారు. ఇకముందు ఇలాంటివి జరగకుండా ఉండేందుకు వెంటనే ప్రభుత్వం తన ప్రకటనను విరమించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.