చండీగఢ్: అత్యాచారం కేసులో దోషి, డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ (Ram Rahim) ఇప్పటికే పది సార్లు పెరోల్‌పై జైలు నుంచి బయటకు వచ్చాడు. ఆయనకు ఆరు సార్లు పెరోల్ ఇచ్చిన మాజీ జైలు అధికారికి బీజేపీ టికెట్ ఇచ్చింది. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థిగా తొలి జాబితాలో పేర్కొంది. దీంతో బీజేపీపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇద్దరు మహిళలపై అత్యాచారం కేసులో గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు 20 ఏళ్లు జైలు శిక్షను కోర్టు విధించింది. హర్యానాలోని రోహ్తక్ జిల్లాలోని సునారియా జైలులో ఆయన శిక్ష అనుభవిస్తున్నాడు. అయితే గుర్మీత్ రామ్ రహీమ్ నాలుగేళ్లలో పది సార్లు పెరోల్‌పై జైలు నుంచి బయటకు వచ్చాడు. లోక్‌సభ ఎన్నికల ముందు జనవరిలో 50 రోజులు పెరోల్‌పై విడుదలయ్యాడు. తాజాగా హర్యానా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆగస్ట్ నెలలో 21 రోజులు పెరోల్ పొందాడు.
కాగా, గుర్మీత్ రామ్ రహీమ్‌కు ఆరు సార్లు పెరోల్ మంజూరు చేసిన జైలు అధికారి సునీల్ సంగ్వాన్ ఇటీవల ఆ పోస్ట్‌కు రాజీనామా చేశారు. అయితే 67 మంది అభ్యర్థులతో బీజేపీ విడుదల చేసిన తొలి జాబితాలో సునీల్ సంగ్వాన్ పేరును ఆ పార్టీ పేర్కొంది. దాద్రీ స్థానం అభ్యర్థిగా ప్రకటించింది.
మరోవైపు 2019లో ఆ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన బీజేపీ మాజీ నేత సోమ్‌వీర్ సాంగ్వాన్ మళ్లీ అక్కడి నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. దీని కోసం కాంగ్రెస్ పార్టీలో ఆయన చేరనున్నట్లు తెలుస్తున్నది. అయితే గుర్మీత్‌కు చాలా సార్లు పెరోల్ మంజూరు చేయడం, ఆయనకు ఆరు సార్లు పెరోల్ ఇచ్చిన మాజీ జైలు అధికారికి బీజేపీ టికెట్ ఇవ్వడంపై కాంగ్రెస్ మండిపడింది.