Karnataka Elections | బెంగళూరు, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కర్ణాటకలో బీజేపీకి నేతల గుడ్‌బై పర్వం కొనసాగుతున్నది. ఈ జాబితాలో మాజీ సీఎం జగదీశ్ శెట్టర్, మాజీ డిప్యూటీ సీఎం లక్ష్మణ్ సవది వంటి నేతలు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల వేళ రాష్ట్ర బీజేపీలో నెలకొన్న ఈ సంక్షోభానికి ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ కారణమనే ఆరోపణలు వస్తున్నాయి. తమకు టికెట్ రాకుండా కుట్రలు చేసి, ఆయనకు అనుకూలంగా ఉండే వారికి టికెట్లు ఇప్పించుకొన్నారని పలువురు ఆరోపిస్తున్నారు. సంతోష్ కుట్రల వల్లే తనకు టికెట్ రాలేదని శెట్టర్ పేర్కొన్నారు. సంతోష్ విధానాలు పార్టీని సర్వనాశనం చేస్తున్నాయంటూ ఆయన చేసిన ఆరోపణలు అటు బీజేపీని, ఇటు సంఘ్‌పరివార్‌ను దిగ్భ్రాంతికి గురిచేశాయి.
కొన్నేండ్లుగా తెరవెనుక రాజకీయాలు నడిపిన బీఎల్ సంతోష్ ఇప్పుడు తెరముందుకు వచ్చారు. ఈ క్రమంలో తన వ్యవహారశైలితో పార్టీలోనే శత్రువులను పెంచుకొన్నారని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఆయన చేసిన అవమానాలను సహించి, ఏకపక్ష నిర్ణయాలను సహించిన వారు.. ఇక ఉండబట్టలేక బీజేపీకి టాటా చెబుతున్నారని పార్టీలోనే అంతర్గతంగా చర్చ జరుగుతున్నది. పార్టీకి కార్యకర్తలే ముఖ్యమని, నాయకులు కాదని నాయకత్వం చెప్పిన మాట ఆచరణలో విఫలమైందని, అసెంబ్లీ ఎన్నికల టికెట్ పొందిన వారిలో బీఎల్ సంతోష్‌కు అనుకూలంగా ఉండే వారే అధికమని, ఇది పార్టీ ప్రయోజనాలను దెబ్బతీసే అవకాశం ఉన్నదని పార్టీ సీనియర్లు ఆందోళనలో పడ్డారు. కనీసం 30 మంది తిరుగుబాటు అభ్యర్థులుగా బరిలోకి దిగనున్నట్టు తెలుస్తున్నది. ఇది వచ్చే ఎన్నికల్లో బీజేపీకి భారీ నష్టం చేకూర్చే అవకాశం లేకపోలేదనే విశ్లేషణలు వస్తున్నాయి.
కేరళ, తమిళనాడు, తెలంగాణ, పశ్చిమ బెంగాల్‌లకు పార్టీ బాధ్యులుగా నియమించినప్పటికీ అకడ బీజేపీకి సంతోష్ వల్ల ఒరిగిందేమీ లేదనే వాదన ఉన్నది. తెలంగాణలో ఎమ్మెల్యేలను కొనుగోలు కుట్ర అడ్డం తిరిగి బట్టబయలైంది. ఆపరేషన్ కమలం వికటించిన ఈ కేసులో సంతోష్ నిందితుడిగా ఉన్నారు. తాను చెప్పినదాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తున్నందునే సంతోష్‌కు మోదీ పలు బాధ్యతలు అప్పగిస్తూ అందలం ఎక్కిస్తున్నారనే చర్చ పార్టీ వర్గాల్లో నడుస్తున్నది. సొంత రాష్ట్రం కర్ణాటకలో ఆయన తీసుకున్న పలు నిర్ణయాలు విమర్శలకు గురయ్యాయి. గతంలో అధికారంపై కన్నేసిన సంతోష్.. యెడియూరప్ప సీఎంగా ఉన్న సమయంలో ఆయన వ్యతిరేకులను చేరదీశారు. అధిష్ఠానంతో సాన్నిహిత్యం పెరిగేకొద్దీ పార్టీలో యెడియూరప్ప ప్రాబల్యానికి గండికొట్టారు.
ఎన్నికల వేళ కర్ణాటక బీజేపీకి మరో దెబ్బ పడింది. సీనియర్ నేత, ఎమ్మెల్సీ అయనూరు మంజునాథ్ తన పదవికితో పాటు బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి బుధవారం రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ శివమొగ్గ టికెట్ ఇవ్వకుండా బీజేపీ మోసం చేసిందని ఆరోపించారు. గురువారం శివమొగ్గ స్థానానికి జేడీఎస్ అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నట్టు తెలిపారు. బీ ఫామ్ కూడాతీసుకొన్నానన్నారు.
జహీరాబాద్, ఏప్రిల్ 19: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు జోరుగా నామినేషన్లు దాఖలవుతున్నాయి. నామినేషన్ సమర్పించేందుకు అభ్యర్థులు భారీ ర్యాలీలతో వస్తున్నారు. నామినేషన్ల దాఖలుకు గురువారం చివరిరోజు కావడంతో అధిక సంఖ్యలో నామినేషన్లు వచ్చే అవకాశం ఉన్నదని అధికారులు చెప్తున్నారు.