న్యూఢిల్లీ, జనవరి 12: భారతీయులు చాలా త్వరగా వ్యక్తి పూజకు, వ్యక్తి ఆరాధనకు బానిసలవుతారని ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ వ్యాఖ్యానించారు. ప్రశ్నలు అడిగే తత్వాన్ని ప్రజలు అలవరుచుకోవాలని హితవు చెప్పారు. ఆదివారం గురుగ్రామ్‌లోని మాస్టర్స్ యూనియన్ స్నాతకోత్సవంలో ఆయన ప్రసంగిస్తూ.. మానవ వనరుల లభ్యత లేదనడం అపోహగా అభివర్ణించారు.
నేను లేకుండా పనులు జరగవు అన్న ఆలోచనే తప్పని ఆయన అన్నారు. మన దేశంలో వ్యక్తి పూజ, వ్యక్తి ఆరాధన చాలా వేగంగా జరిగిపోతుంటాయని.. అతను ఎందుకు గొప్ప న్యాయవాది అయ్యాడు, ఎందుకు గొప్ప నాయకుడు అయ్యాడు, ఎందుకు గొప్ప డాక్టర్ అయ్యాడు లాంటి ప్రశ్నలు మనం ఎన్నడూ వేయబోమని ఆయన తెలిపారు. యువత తమను తాము విశ్వసించాలని ధన్కడ్ సూచించారు.