భోపాల్: దొంగతనాల్లో కొత్త ట్రెండ్ మొదలైంది. రసగుల్లాలు, ఉప్పు సంచులు, మేకలు వంటి అసాధారణ వస్తువులను దొంగలు చోరీ చేస్తున్నారు. ఈ వింత దొంగతనాలు స్థానికులతోపాటు పోలీసులను కలవరపరుస్తున్నాయి. (Jabalpur’s Bizarre Thefts) మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్ జిల్లాలో ఈ సంఘటనలు జరిగాయి. ఆ రాష్ట్ర సాంస్కృతిక రాజధాని, ప్రఖ్యాత వ్యంగ్య రచయిత హరిశంకర్ పర్సాయికి నిలయంగా పేరుగాంచిన జబల్పూర్ నగరంలో దొంగతనాల కొత్త ట్రెండ్ మొదలైంది. రసగుల్లాలు, మేకలు, ఉప్పు బస్తాలు వంటి అసాధారణ వస్తువులను స్థానిక దొంగలు లక్ష్యంగా చేసుకుంటున్నారు.
ఇటీవల సెహోరాలో స్కూటర్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు బేకరీ షాపులో చోరీకి పాల్పడ్డారు. యజమాని పరధ్యానంలో ఉంటడం చూసి రసగుల్లాలు దొంగిలించారు. గుట్కా ప్యాకెట్ కూడా ఎత్తుకెత్తారు. ఈ దొంగతనం మొత్తం విలువ రూ.125 మాత్రమే. అయితే పెద్ద నేరం కానప్పటికీ, నైతిక నష్టంగా పరిగణించిన పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేశారు.
అలాగే దేవ్తాల్లో తెల్లటి యాక్టివా స్కూటర్‌పై వచ్చిన ఒక దొంగ, జయపాల్ ప్రజాపతి షాపును లక్ష్యంగా చేసుకున్నాడు. వెయ్యి విలువైన 5 ఉప్పు బస్తాలను దొంగిలించాడు. కూల్‌గా అక్కడి నుంచి పారిపోయాడు. ఈ సంఘటనపై కూడా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరో వింత చోరీ అధర్తల్ జరిగింది. ఖరీదైన లగ్జరీ కారులో కొందరు దొంగలు వచ్చారు. ఒక ఇంటి నుంచి 9 మేకలను దొంగిలించారు. మేకలు మాయం కావడం చూసి యాజమాని షాక్ అయ్యాడు. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. అయాన్, యోగేంద్ర, మోహిసిన్, ఉమర్‌లను పోలీసులు అరెస్టు చేశారు. 8 మేకలను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఒక మేక కనిపించకుండా పోయింది.