న్యూఢిల్లీ: ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్(ఐయూఎంఎల్) పార్టీకి చెందిన ఎంపీ(IUML MPs)లు ఇవాళ పార్లమెంట్ ఆవరణలో నిరసన చేపట్టారు. జ్ఞానవాపి మసీదును, ప్రార్థన చట్టాలను రక్షించాలంటూ ప్లకార్డులను ప్రదర్శించారు. వారణాసిలోని జ్ఞానవాపి మసీదులో ఉన్న సెల్లార్లో గురువారం విగ్రహాలకు హిందువులు పూజలు చేసిన విషయం తెలిసిందే. ఆ పూజలను ఖండిస్తూ ఐయూఎంఎల్ ఎంపీలు ఇవాళ నిరసన చేపట్టారు. ఎంపీలు ఈటీ మహమ్మద్ బాషీర్, కణి కే నవాస్, అబ్దుసమాద్ సందాని ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ఈ ఎంపీలు ఆందోళన చేపట్టారు. జిల్లా కోర్టు ఆదేశాలతో హిందువులు మసీదు సెల్లార్లో పూజలు చేశారు. అయితే ఆ కోర్టు ఆదేశాలను రద్దు చేయాలని ముస్లిం కమిటీ సుప్రీంను ఆశ్రయించింది. కానీ ఈ కేసులో అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించాలని ఆ కమిటీ సభ్యులకు సుప్రీం ఆదేశాలు ఇచ్చింది.