న్యూఢిల్లీ : అత్యధిక కాలం అమెరికాలో కొనసాగిన ప్రభుత్వ షట్డౌన్ ముగిసింది. ప్రభుత్వ కార్యకలాపాల నిర్వహణకు తాత్కాలికంగా నిధులు విడుదల చేసేందుకు పార్లమెంట్ ఆమోదించిన చట్టంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం సంతకం చేశారు. దీంతో 43 రోజుల పాటు ప్రభుత్వాన్ని స్తంభింపచేసిన రిపబ్లికన్లు, డెమోక్రాట్ల మధ్య వివాదం సమసిపోయింది. ప్రతిష్ఠంభనను ముగించేందుకు సెనేట్ ఆమోదించిన చట్టాన్ని ప్రతినిధుల సభ ఆమోదించింది.
తాజా పరిణామం డెమోక్రాట్లకు గట్టి ఎదురుదెబ్బగా పరిశీలకులు భావిస్తున్నారు. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా హయాంలో ఆమోదించిన ఆరోగ్య బీమా కార్యక్రమాలకు సబ్సిడీలు విస్తరించడానికి సంబంధించిన చట్టాన్ని ప్రస్తుత ట్రంప్ ప్రభుత్వం ఒప్పుకోకపోవడంతో డెమోక్రాట్లు ఆర్థిక బిల్లులకు ఆమోదం తెలపకపోవడంతో షట్డౌన్ అనివార్యమైంది. నిబంధనల ప్రకారం ఆర్థిక బడ్జెట్ పార్లమెంట్లో ఆమోదం పొందాలంటే రిపబ్లికన్లకు 60 ఓట్లు ఉండాలి. మెజారిటీ లేని కారణంగా ఆర్థిక బిల్లు ఆమోదం పొందలేదు.