Italy PM : భారత ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) బుధవారం తన 75వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని ఇటలీ ప్రధాని (Italy prime minister) జార్జియా మెలోనీ (Georgia Melony) ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రధాని మోదీతో గతంలో దిగిన ఒక ఫొటోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’లో ఆమె షేర్ చేశారు. ప్రధాని మోదీ నాయకత్వ పటిమను కొనియాడారు.
‘భారత ప్రధాని నరేంద్ర మోదీకి 75వ పుట్టినరోజు శుభాకాంక్షలు. కోట్లాది మంది ప్రజలను నడిపించడంలో ఆయన బలం, సంకల్పం, సామర్థ్యం ఎంతో స్ఫూర్తిదాయకం. భారత్‌ను ఉజ్వల భవిష్యత్తు వైపు నడిపించడానికి, మన దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి ఆయనకు మంచి ఆరోగ్యం, శక్తి లభించాలని ఆకాంక్షిస్తున్నా’ అని మెలోనీ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. ప్రధాని మోదీ, మెలోనీ మధ్య ఉన్న స్నేహపూర్వక సంబంధాలు గత కొంతకాలంగా అంతర్జాతీయ వేదికలపై, సోషల్ మీడియాలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
వీరిద్దరి పేర్లను కలుపుతూ నెటిజన్లు సృష్టించిన ‘మెలోడీ’ అనే హ్యాష్‌ట్యాగ్ తరచుగా ట్రెండింగ్‌లో ఉండటం విశేషం. ఈ నెల 10న ఇద్దరు నేతలు ఫోన్లో సంభాషించారు. ఈ సందర్భంగా భారత్-ఇటలీ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింతగా పెంచుకోవాలని వారు పునరుద్ఘాటించారు. 2026లో భారత్ ఆతిథ్యం ఇవ్వనున్న ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌కు మెలోనీ తన పూర్తి మద్దతును ప్రకటించారు. అలాగే భారత్-యూరోపియన్ యూనియన్ వాణిజ్య ఒప్పందం, ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరప్ ఎకనామిక్ కారిడార్ (IMEEC) వంటి కీలక అంశాలపై కూడా వీరి మధ్య చర్చ జరిగింది.
అదేవిధంగా ఉక్రెయిన్ సంక్షోభానికి శాంతియుత పరిష్కారం అవసరమని ఇద్దరు నేతలు ఏకాభిప్రాయం వ్యక్తంచేశారు. ఈ ఏడాది జూన్‌లో కెనడాలో జరిగిన 51వ జీ7 సదస్సులో కూడా మోదీ, మెలోనీ సమావేశమై ఇరుదేశాల స్నేహాన్ని మరింత పటిష్ఠం చేసుకునేందుకు కట్టుబడి ఉన్నామని చెప్పారు.