ముంబై, సెప్టెంబర్ 12: నిరాహార దీక్ష విరమించేందుకు సిద్ధంగానే ఉన్నానని మరాఠా నేత మనోజ్ జరాంగే పాటిల్ పేర్కొన్నారు. అయితే మహారాష్ట్ర ప్రభుత్వం మరాఠా కమ్యూనిటీకి ఓబీసీ రిజర్వేషన్ల కింద కుంబీ కుల ధ్రువీకరణ సర్టిఫికెట్ల జారీచేయడం ప్రారంభించే వరకు తాను జాల్నా జిల్లాలోని దీక్షా స్థలిని వీడనని స్పష్టం చేశారు. జరాంగే మంగళవారం మాట్లాడుతూ తాను నిరాహార దీక్ష విరమించేందుకు సిద్ధంగానే ఉన్నానని పేర్కొంటూ.. రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని షరతులు విధించారు. కుంబీ సర్టిఫికెట్ల జారీని ప్రారంభించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా మరాఠా రిజర్వేషన్ల కోసం ఆందోళనలు చేసిన వారిపై నమోదు చేసిన కేసులను ఉపసంహరించుకోవాలని, ఆందోళనకారులపై లాఠీచార్జికి ఆదేశాలు ఇచ్చిన ఉన్నతాధికారులను సస్పెం డ్ చేయాలన్నారు.
మరాఠా రిజర్వేషన్లపై ప్రభుత్వం నియమించిన కమిటీ తన నివేదికను రూపొందించేందుకు నెల సమయం ఇస్తున్నామని డెడ్లైన్ విధించారు. కమిటీ నివేదిక ఎలా ఉన్నా.. మరాఠాలకు కుంబీ సర్టిఫికెట్ల జారీని ప్రారంభించాలన్నారు. తాను నిరాహార దీక్ష విరమించే సమయంలో సీఎం షిండేతో పాటు ఇద్దరు డిప్యూటీ సీఎంలు దీక్షా స్థలి వద్దకు రావాలని, పైన పేర్కొన్న డిమాండ్లపై రాతపూర్వక హామీ ఇవ్వాలని జరాంగే స్పష్టం చేశారు. కాగా, ఆందోళనకారులపై కేసులను ఉపసంహరించనున్నట్టు సీఎం షిండే సోమవారం అఖిలపక్ష సమావేశం అనంతరం వెల్లడించారు. జరాంగే నిరహార దీక్ష విరమించాలని కోరుతూ సమావేశానికి హాజరైన అన్ని పక్షాలు తీర్మానం చేశాయని పేర్కొన్నారు. లాఠీచార్జి ఘటనలో ప్రమేయం ఉన్న ముగ్గురు పోలీసు అధికారులను సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు.