ISRO | న్యూఢిల్లీ : చంద్రయాన్, మంగళ్యాన్లతో సామాన్యులను సైతం సైన్స్ వైపు ఆకర్షించిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)కు ఆర్థిక మద్దతు అంతంత మాత్రంగానే ఉంది. 2014-2024 మధ్య కాలంలో మన దేశ జీడీపీకి అంతరిక్ష రంగం నుంచి 60 బిలియన్ డాలర్లు సమకూరింది. జాతీయ రోదసి దినోత్సవం సందర్భంగా కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ గురువారం విడుదల చేసిన నివేదిక ప్రకారం, రోదసి రంగంలో 400కుపైగా ప్రైవేట్ కంపెనీలు ఉన్నాయి. వీటి వల్ల 6.3 బిలియన్ డాలర్ల రెవెన్యూ వస్తుండగా, 47 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించాయి.
ప్రపంచంలో అతి పెద్ద రోదసి ఆర్థిక వ్యవస్థల్లో మన దేశం ఎనిమిదో స్థానంలో ఉంది. 2024నాటికి మన దేశ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ విలువ సుమారు రూ.6,700 కోట్లు. ప్రపంచ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థలో ఇది 2-3 శాతం కాగా, వచ్చే దశాబ్దానికి దీనిని 10 శాతానికి పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే నాసా బడ్జెట్ కన్నా ఇస్రో బడ్జెట్ 15 రెట్లు ఎక్కువ. ఇస్రోను స్థాపించి 55 ఏండ్లు అవుతున్నది. ఈ మొత్తం కాలంలో ఇస్రో పెట్టుబడులు నాసా ఒక ఏడాది బడ్జెట్ కన్నా తక్కువ. ఇస్రో ప్రస్తుత వార్షిక బడ్జెట్ సుమారు 1.6 బిలియన్ డాలర్లు కాగా, నాసా వార్షిక బడ్జెట్ 25 బిలియన్ డాలర్లు. ఇస్రో చైర్మన్ సోమనాథ్ ఇటీవల కర్ణాటక విద్యార్థులతో మాట్లాడుతూ, అంతరిక్ష రంగంలో భాగస్వాములైన దేశాలతో ఆధిపత్యం కోసం పోరాడటం కన్నా దేశానికి సేవ చేయడంపైన మాత్రమే ఇస్రో దృష్టి సారించిందన్నారు.