బెంగళూరు: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సెమీ క్రయోజనిక్ ఇంజిన్ పరీక్షను విజయవంతంగా నిర్వహించింది. తమిళనాడు రాష్ట్రం మహేంద్రగిరిలోని ఇస్రోకు చెందిన ఇంటిగ్రేటెడ్ ఇంజిన్, స్టేజ్ టెస్ట్ ఫెసిలిటీ కేంద్రంలో పరీక్షను నిర్వహించినట్టు బెంగళూరులోని నేషనల్ స్పేస్ ఏజెన్సీ తెలిపింది. లిక్విడ్ ఆక్సిజన్, కిరోసిన్ మిశ్రమంతో పని చేసేలా దీనిని రూపొందిస్తున్నామని ఇస్రో తెలిపింది. 2 వేల కిలో న్యూటన్ల సామర్థ్యం ఉన్న ఇంజిన్ను అభివృద్ధి చేసే ప్రక్రియలో భాగంగా ఈ ప్రయోగాన్ని నిర్వహించినట్టు వారు వెల్లడించారు. భవిష్యత్తులో మరిన్ని ప్రయోగాలు చేసేందుకు ఇది ఎంతగానో దోహదపడుతుందని ఇస్రో తెలిపింది.