PSLV- C61 | శ్రీహరికోట, మే 18: అంతరిక్ష రంగంలో వరుస విజయాలతో అప్రతిహతంగా దూసుకుపోతున్న ఇస్రోకు ఎదురుదెబ్బ తగిలింది. ఆదివారం ఏపీలోని శ్రీహరికోట నుంచి ప్రయోగించిన పీఎస్ఎల్వీ-సీ61 ప్రయోగంలో సాంకేతిక సమస్య తలెత్తింది. ఆదివారం ఉదయం 5:59 గంటలకు పీఎస్ఎల్వీ-సీ 61 మిషన్‌ను ప్రయోగించింది. అయితే ప్రయోగం మొదలైన కొద్దిసేపటికే రాకెట్లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీనిపై ఇస్రో చైర్మన్ నారాయణ మాట్లాడుతూ.. మూడో స్టేజీలో సాంకేతిక సమస్య తలెత్తినట్టు చెప్పారు. దీంతో ప్రయోగం పూర్తి కాలేదన్నారు.
విశ్లేషించిన అనంతరం పూర్తి సమాచారం ఇస్తామన్నారు. ఇస్రోకు ఇది 101వ మిషన్. ఈ ప్రయోగం ద్వారా ఈవోఎస్-09 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టాలని ఇస్రో భావించింది. 2022లో ప్రయోగించిన ఈవోఎస్-04 ఉపగ్రహానికి ప్రత్యామ్నాయంగా దీనిని ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. పీఎస్ఎల్వీని అత్యంత విజయవంతమైన రాకెట్‌గా పిలుస్తుంటారు. ఇప్పటివరకు 63సార్లు ప్రయోగించగా కేవలం మూడుసార్లు మాత్రమే విఫలం అయినట్టు ఇస్రో వర్గాలు చెప్పాయి. గతంలో 1993లో, 2017లో పీఎస్ఎల్వీ విఫలం అయ్యింది. పీఎస్ఎల్వీ 61 రాకెట్ విఫలంపై దర్యాప్తు చేసేందుకు ఒక కమిటీని వేసినట్టు ఇస్రో చైర్మన్ తెలిపారు.