హైదరాబాద్, జనవరి 29 (నమస్తే తెలంగాణ): ఇస్రో చేపట్టిన వందో ప్రయోగం శాస్త్రవేత్తలు, సిబ్బంది అంకితభావం, పట్టుదలకు నిదర్శనమని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభినందించారు. ఆర్యభట్ట నుంచి మంగళ్యాన్ దాకా ఇస్రో చేసిన 100 ప్రయోగాలు దేశాన్ని గర్వించేలా చేశాయని పేర్కొన్నారు. విక్రమ్ సారాభాయ్ వంటి మహనీయులు వేసిన కక్ష్యలో పయనిస్తూ భారత అంతరిక్ష రంగం అద్భుత ఫలితాలు సాధిస్తున్నదని ఆయన కొనియాడారు.
అంతరిక్ష పరిశోధనా రంగంలో ఇస్రో శాస్త్రవేత్తలు సృష్టిస్తున్న అద్భుతాలు దేశానికి గర్వకారణమని మాజీ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ఇస్రో వందో ప్రయోగాన్ని ఆయన అభినందించారు. ఈ స్ఫూర్తితో దేశ అంతరిక్ష పరిశోధన రంగం మరింత అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు.