Israel Air strikes : లెబనాన్ రాజధానిలో కొంత భాగాన్ని విడిచిపెట్టి వెళ్లిపోవాలని అక్కడి నివాసితులను ఇజ్రాయెల్ సైన్యం ఆదేశించింది. ఆ ఆదేశం ఇచ్చిన గంటలోనే దక్షిణ బీరూట్‌పై ఇజ్రాయెల్ సైన్యం దాడులు జరిపింది. హెజ్బొల్లాను అంతమొందించడమే లక్ష్యంగా గతకొన్ని రోజులుగా ఇజ్రాయెల్ జరుపుతున్న ఈ దాడుల్లో పలువురు అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఇవాళ దక్షిణ లెబనాన్‌లోని మున్సిపల్ భవనంపై జరిగిన దాడిలో మేయర్ సహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.
ఇజ్రాయెల్ మిలిటరీ ప్రతినిధి అవిచారు అడ్రేయా బీరూట్‌కి దక్షిణ భాగంలోని శివారు ప్రాంతమైన హరేట్ హ్రీక్లోగల నివాసితులను ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని ఆదేశించారు. అనంతరం అక్కడున్న భవనాలపై ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడులకు పాల్పడడంతో ఆ భవనాల్లో నుంచి నల్లటి పొగలు కమ్ముకున్నాయి. ఈ ఘటన జరిగిన కొన్ని క్షణాల వ్యవధిలోనే దక్షిణ బీరూట్‌లో ఇజ్రాయెల్ రెండోసారి దాడికి పాల్పడింది.
దాడులు జరపడానికి ముందు ‘మీరు హిజ్బుల్లా గ్రూపుకు, వారి సౌకర్యాలకు సమీపంలో ఉన్నారు. ఇజ్రాయెల్ మిలిటరీ హిజ్బుల్లా తీరును వ్యతిరేకిస్తుంది. అందుకే మీ (హారెట్ హ్రీక్ నివాసితులు) పై దాడులు జరుపుతున్నాం’ అని అవిచారు అడ్రేయా ఎక్స్‌లో పోస్టు చేశారు. గత కొన్ని వారాల నుంచి దక్షిణ బీరూట్‌లో, లెబనాన్ అంతటా ఇజ్రాయెల్ సైన్యం బాంబు దాడులకు పాల్పడుతోంది.
గత నెలలో ఇజ్రాయెల్ సైన్యం దాడులు తీవ్రతరం చేసినప్పటి నుంచి లెబనాన్‌లో కనీసం 1,356 మంది మృతి చెందారని లెబనీస్ ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. కానీ మృతుల సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అనధికారిక అంచనాలు స్పష్టం చేస్తున్నాయి.