Delhi High court : భార్య గర్భం దాల్చడం అనేది అంతకుముందు ఆమె భర్తపట్ల చేసిన క్రూరమైన చర్యలను తుడిపేయలేదని ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ మేరకు ఆమె భర్తకు విడాకులు మంజూరు చేసింది. సదరు మహిళ తన భర్తపట్ల క్రూరంగా వ్యవహరించిందనే విషయం రుజువైందని, అలాంటప్పుడు ఆమె గర్భవతి అనే కారణంతో విడాకులను వాయిదా వేయలేమని స్పష్టంచేసింది.
ఈ మేరకు అంతకుముందు ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు కొట్టివేసింది. 2016లో వివాహం చేసుకున్న ఓ జంట మధ్య కొద్ది రోజులకే గొడవలు మొదలయ్యాయి. భార్య క్రూరమైన చర్యలను భరించలేక 2021లో భర్త ఫ్యామిలీ కోర్టులో విడాకుల కేసు వేశాడు. దాంతో భార్య అతడిపై వరకట్న వేధింపుల కేసు వేసింది.
అయితే హార్మోనల్ సమస్యవల్ల ఆమెకు 2019లో ఒకసారి గర్భస్రావం అయ్యిందని, ఇప్పుడు కూడా ఆమె గర్భంతో ఉన్నందున డెలివరీ అయ్యేవరకు విడాకులు మంజూరు చేయలేమని పేర్కొంటూ ఫ్యామిలీ కోర్టు భర్త పిటిషన్ను కొట్టివేసింది. దాంతో ఫ్యామిటీ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ భర్త ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. కోర్డు అతడికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది.