Bangladesh | కోల్‌కతా: బంగ్లాదేశ్‌లోని ఢాకా జిల్లాలో ఉన్న తమ కేంద్రం ఆలయాన్ని శనివారం తెల్లవారుజామున ముష్కరులు దగ్ధం చేసినట్లు ఇస్కాన్ ఆరోపించింది. తమ సంస్థ సభ్యుల పైన, హిందూ మతస్తుల పైన బంగ్లాదేశ్‌లో దాడులు నిర్నిరోధంగా కొనసాగుతున్నాయని ఇస్కాన్ కోల్‌కతా ఉపాధ్యక్షుడు రాధారమణ్ దాస్ తెలిపారు. ధౌర్ గ్రామంలో హరే కృష్ణ నంహట్ట సంఘం నిర్వహిస్తున్న శ్రీ రాధాకృష్ణ ఆలయం, శ్రీ మహాభాగ్య లక్ష్మీనారాయణ ఆలయంలోని విగ్రహాలను ముష్కరులు తగలబెట్టారని ఆయన తెలిపారు.
ఆలయం వెనుక భాగంలో పై కప్పును తొలగించిన దుండగులు పెట్రోల్ పోసి నిప్పు పెట్టారని, ఈ ఘటనలో ఆలయంలోని విగ్రహాలతోపాటు ఇతర వస్తువులన్నీ కాలి బూడిదై పోయాయని ఆయన తెలిపారు. తమ సభ్యులపై జరుగుతున్న దాడుల గురించి బంగ్లాదేశ్‌లోని ఆపద్ధర్మ ప్రభుత్వానికి తమ ఆందోళనను తెలియచేసినప్పటికీ అక్కడి పోలీసులు, పాలకుల నుంచి తగినంత స్పందన రావడం లేదని రమణ దాస్ ఆవేదన వ్యక్తం చేశారు.
బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా అమెరికాలో శాంతియుత ర్యాలీలు నిర్వహించాలని పలు హిందూ సంఘాలు నిర్ణయించాయి. ఆదివారం చికాగోలో ‘జాతి విధ్వంసం ఆపండి: బంగ్లాదేశ్‌లో హిందువుల ప్రాణాలు కాపాడండి’ పేరుతో హిందువులు ర్యాలీ నిర్వహించనున్నారు. సోమవారం వాషింగ్టన్‌లోని వైట్ హౌస్ వద్ద మరో ర్యాలీ నిర్వహించనున్నట్టు హిందూ యాక్షన్ అనే సంస్థ ప్రకటించింది.