న్యూఢిల్లీ : దేశ రాజధాని నగరం ఢిల్లీలో ఆత్మాహుతి దాడులు చేసేందుకు జరుగుతున్న కుట్రను ఢిల్లీ పోలీసులు భగ్నం చేశారు. ఈ కుట్రకు పాల్పడుతున్న ఐసిస్ ఉగ్రవాద సంస్థ మాడ్యూల్ గుట్టును రట్టు చేసి, ఇద్దరు ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. నిందితులు ఆత్మాహుతి దాడి చేసేందుకు శిక్షణ పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు. అరెస్టయిన ఇద్దరిలో ఒకడి పేరు అద్నాన్. వీరిద్దరూ భోపాల్‌కు చెందినవారే. వీరికి పాకిస్థాన్ ఐఎస్ఐతో సంబంధాలు ఉండి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు.
నిఘా సమాచారం మేరకు భోపాల్, ఢిల్లీలోని సాదిక్ నగర్లలో నిర్వహించిన సమన్వయంతో కూడిన ఆపరేషన్‌లో ఈ ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. వీరి నుంచి ఆయుధాలు, పేలుడు సామగ్రి, ఎలక్ట్రానిక్ డివైస్‌లు, నేరపూరిత మెటీరియల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్‌కు అదనపు పోలీస్ కమిషనర్ ప్రమోద్ కుష్వాహా, ఏసీపీ లలిత్ మోహన్ నేగి సారథ్యం వహించారు.