న్యూఢిల్లీ, నవంబర్ 8: ట్విట్టర్ యూజర్లపై ఎలాన్ మస్క్ మరో బాంబు వేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తున్నది. బ్లూటిక్ సబ్స్క్రిప్షన్ కోసం నెలకు 8 డాలర్లు చెల్లించాల్సి ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన మస్క్.. తాజాగా ట్విట్టర్ వినియోగించే యూజర్లందరి నుంచి డబ్బులు వసూలు చేసే ప్రణాళికలో ఉన్నాడని ప్లాట్‌ఫార్మర్ తన నివేదికలో వెల్లడించింది.
ట్విట్టర్లో ఖాతా కొనసాగించేందుకు, కొత్త ఖాతా క్రియేట్ చేసుకొనేందుకు ఇకపై సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకొనేలా మస్క్ ఆలోచన చేస్తున్నాడని తెలిపింది. దీనిపై ఉద్యోగులతో అంతర్గత సమావేశాల్లో చర్చలు జరుపుతున్నారని పేర్కొన్నది. యూజర్లు నెలకు పరిమిత వ్యవధి వరకు మాత్రమే ట్విట్టర్‌ను ఉచితంగా వినియోగించుకొనేలా, ఆ తర్వాత బ్రౌజింగ్‌కు సబ్స్క్రిప్షన్ తీసుకొనేలా ప్లాన్ చేస్తున్నారని నివేదికలు చెబుతున్నాయి.
మస్టోడాన్, ‘కూ’లకు మారుతున్న నెటిజన్లు
ఎలాన్ మస్క్ ట్విట్టర్‌ను టేకోవర్ చేసిన తర్వాత అటు ఉద్యోగులకు, ఇటు యూజర్లకు షాకుల మీద షాకులు ఇస్తున్నారు. దీంతో మస్క్‌కు రివర్స్ కౌంటర్ ఇచ్చేలా యూజర్లు ట్విట్టర్ నుంచి వైదొలుగుతున్నారు. చాలా మంది కూ, మస్టోడాన్ అనే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లకు మారిపోతున్నారు.