Swine flu : దేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీ (Delhi), బెంగళూరు (Bengalore) లలో హెచ్1ఎన్1 (Swine flu) కేసులు వేగంగా పెరుగుతున్నాయి. బెంగళూరులో రోగుల సంఖ్య ఎక్కువగా ఉన్నది. అయినప్పటికీ ఆ నగరంలో పరిస్థితి మరీ ఆందోళనకరంగా ఉందని చెప్పలేమని వైద్య నిపుణులు స్పష్టంచేస్తున్నారు. రెండు నగరాల మధ్య నిఘా వ్యవస్థ, పరీక్షల నిర్వహణ తీరు, వాతావరణ పరిస్థితుల్లోని వ్యత్యాసాల కారణంగానే కేసుల సంఖ్యలో ఈ తేడాలు కనిపిస్తున్నాయని వారు తెలిపారు.
ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. ఈ ఏడాది ఆగస్టు 20 నాటికి ఢిల్లీలో 1,777 కేసులు నమోదయ్యాయి. మరోవైపు బెంగళూరులోని ఒక పాఠశాలలో 500 మందికిపైగా విద్యార్థులు, సిబ్బంది ఫ్లూ లక్షణాలతో బాధపడగా.. వారిలో ఇద్దరికి స్వైన్ ఫ్లూ ఉన్నట్లు నిర్ధారణ అయింది. అయితే ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్నది కొత్త రకం వైరస్ కాదని, అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ల ద్వారా నివారించదగ్గ పాత స్ట్రెయిన్ మాత్రమేనని ఐసీఎంఆర్ స్పష్టంచేసింది.
బెంగళూరు వాతావరణం కారణంగా ఇక్కడ శ్వాసకోశ సంబంధిత వైరల్ ఇన్ఫెక్షన్లు ఎక్కువకాలం ప్రభావాన్ని చూపుతాయని ఆస్టర్ వైట్‌ఫీల్డ్ హాస్పిటల్స్‌కు చెందిన డాక్టర్ ఐశ్వర్య తెలిపారు. సాధారణంగా జూన్ నెలలో ప్రారంభమయ్యే ఈ కేసులు.. జనవరి-ఫిబ్రవరి వరకు కొనసాగుతాయని, దీనివల్ల వ్యాధివ్యాప్తి సుదీర్ఘకాలం ఉంటుందని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం పొడి దగ్గు, గొంతు నొప్పి, జ్వరం, కండరాల నొప్పులు, తీవ్రమైన నీరసం వంటివి ప్రధాన లక్షణాలుగా కనిపిస్తున్నాయి.
వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణులతోపాటు ఊపిరితిత్తులు, గుండె, మూత్రపిండాల సంబంధిత దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. లక్షణాలు తీవ్రంగా ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని, సొంతంగా యాంటీబయాటిక్స్ వాడకూడదని హెచ్చరిస్తున్నారు. వ్యాక్సినేషన్ తీసుకోవడం ద్వారా వ్యాధి తీవ్రతను, ఆసుపత్రిలో చేరాల్సిన ముప్పును తగ్గించుకోవచ్చని వారు స్పష్టంచేస్తున్నారు.