Reynolds | 90వ దశకంలో పుట్టిన పిల్లలకు ఎన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయి. ఆటల నుంచి మొదలుపెడితే చదువుల దాకా ఎన్నింటితోనో పెనవేసుకున్న బంధాలు ఉన్నాయి. కానీ ఈ స్మార్ట్ యుగంలో ఒక్కొక్కటిగా అవన్నీ కనుమరుగవుతున్నాయి. వాటిలో ఇప్పుడు రెనాల్డ్స్ పెన్నులు కూడా చేరిపోయాయని సోషల్‌మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. 045 ఫైన్ కార్బర్ బాల్ పాయింట్ పెన్నుల ఉత్పత్తిని రెనాల్డ్స్ కంపెనీ నిలిపివేసినట్లుగా ఓ వార్త తెగ చక్కర్లు కొడుతున్నది.
నీలిరంగు క్యాప్‌తో తెలుపు రంగులో ఉండే ఈ పెన్ను ఉందంటే అప్పట్లో పిల్లలు ఎంతో గొప్పగా ఫీలైపోయారు. పిల్లలు స్కూల్‌కి వెళ్తున్నారంటే కచ్చితంగా ఈ పెన్ను కొనివ్వమని పేరెంట్స్ దగ్గర మారాం చేసేవాళ్లు. అలా రెనాల్డ్స్ 045 ఫైన్ కార్బర్ బాల్ పాయింట్ పెన్నులతో 90స్ కిడ్స్‌కి ఎంతో అనుబంధం ఉంది. కానీ కాలం మారినకొద్ది రకరకాల డిజైన్ల పెన్నులు వచ్చేశాయి. పైగా ఇప్పుడు పిల్లలు కూడా ట్యాబ్స్ వాడుతుండటంతో పెన్నుల గిరాకీ తగ్గిపోయింది. ఈ క్రమంలో 45 ఏండ్ల ప్రస్థానానికి గుడ్ బై చెబుతూ 045 ఫైన్ కార్బర్ బాల్ పాయింట్ పెన్నుల ఉత్పత్తిని రెనాల్డ్స్ కంపెనీ నిలిపివేస్తుందని ఇటీవల జోరుగా ప్రచారం మొదలైంది. దీనికి సంబంధించిన సోషల్‌మీడియాలో పోస్ట్ అయిన ఓ వార్తను దాదాపు 2.3 మిలియన్ల మంది చూశారు. ఈ నేపథ్యంలో రెనాల్డ్స్ కంపెనీ స్పందించింది. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఆ వార్తలో నిజం లేదని తేల్చి చెప్పింది. తమ కస్టమర్లను తప్పుదోవ పట్టించేందుకే ఇటువంటి వదంతులు వ్యాప్తి చేస్తున్నారని పేర్కొంది. ఈ మేరకు ఫేస్బుక్లో ఒక పోస్టు పెట్టింది.
‘ రెనాల్డ్స్ కంపెనీకి ఇండియాతో 45 ఏండ్ల అనుబంధం ఉంది. ఇక్కడ మా వ్యాపారాన్ని మరింత విస్తరించాలని అనుకుంటున్నాం. ఇలాంటి సమయంలో మా గురించి వివిధ మీడియాల్లో తప్పుడు వార్తలు ప్రచారం అవుతున్నాయి. వాటిని చూసి ఆందోళనకు గురికావద్దు. సరైన సమాచారం కోసం మా వెబ్సైట్, సోషల్ మీడియా ఛానళ్లను సంప్రదించగలరు. కస్టమర్ల నమ్మకమే మాకు అత్యంత ప్రాధాన్యం.’ అని రెనాల్డ్స్ కంపెనీ ఫేస్బుక్ ద్వారా వెల్లడించింది. రెనాల్డ్స్ 045 ఫైన్ కార్బర్ బాల్ పాయింట్ పెన్నులు ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్నాయని పేర్కొంది. గతంలో 5 రూపాయలు ఉన్న ఈ పెన్ను ధర.. ఇప్పుడు రూ.10కి పెంచామని తెలిపింది. ఈ పెన్ను డిజైన్‌లో కూడా ఎలాంటి మార్పు చేసే ఉద్దేశం లేదని స్పష్టం చేసింది.